ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల్లో తాము, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిపి కూటమిగా ఏర్పడితే ప్రజలు 94 శాతం విజయం అందించారని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం స్థిరమైన పాలన అవసరం, గతంలో చేసిన తప్పులను మళ్లీ పునరావృతం చేయకూడదని ఆయన సూచించారు. మంచి పనులను ప్రోత్సహించడం ద్వారా మాత్రమే లక్ష్యాలను సాధించగలమని చెప్పారు. దీపావళి వేడుకల్లో తన సతీమణి భువనేశ్వరితో కలిసి విజయవాడ పున్నమి ఘాట్ లో పాల్గొని ప్రజలకు సాంత్వన మరియు ఉత్సాహం అందించారు.
ముఖ్యంగా అమరావతిలో రాజధాని నిర్మాణం మొదలైందని, రాబోయే మూడేళ్లలో రూ.60,000 కోట్ల పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌లో ఐటీ రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు హైటెక్ సిటీని తీసుకువచ్చామని, ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికోసం క్వాంటమ్ కంప్యూటర్‌ను కూడా దేశానికి తీసుకొస్తున్నట్టు వివరించారు. 2027 జూన్ లేదా డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయడం లక్ష్యమని, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని స్పష్టం చేశారు.
గత ఐదేళ్లలో అప్పులు పెరిగి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ, ఉద్యోగుల సహకారాన్ని గుర్తించి ఈ నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు దీపావళి బోనస్, డీఏ పెంపు, పోలీసులకు సరెండర్ లీవ్, ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు అందించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉద్యోగులు స్మార్ట్ వర్క్ చేయాలి, సాయంత్రం 6 గంటల తర్వాత పని అవసరం లేదని, విపత్తు సమయాల్లో ఎక్కువ శ్రమ చేయాలని సూచించారు. శని, ఆదివారాలు విశ్రాంతి తీసుకుని సోమవారం నుండి ఉత్సాహంగా పనిచేయాలని సూచన చేశారు.
కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు మంచి వాతావరణం ఏర్పడిందని చెప్పారు. ఎన్డీయే 22 ఎంపీలను గెలిపించడం వల్ల కేంద్రంలో వేగంగా పనులు జరుగుతున్నాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ప్రాణం పోసిందని వివరించారు. సామాజిక పింఛన్లు, తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ్, అన్నక్యాంటీన్, దీపం-2, ఆటోడ్రైవర్లకు భరోసా వంటి పథకాలను అమలు చేశామని, సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. ఈ సంస్కరణల వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.15,000 ఆదా అవుతుందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి పథకాలు కొనసాగిస్తామని తెలిపారు.