పోలీసు అధికారులపై వైసీపీ నాయకులు (YSRCP Leaders) చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు చిత్తూరు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధికారులు (Police Association). వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి, ఎంసీ విజయా నందరెడ్డి చిత్తూరు జిల్లా పోలీసు అధికారులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీస్ అసోసియేషన్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంగారుపాళ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు వైసీపీ నేతలని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేశారంటూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సరికావని పేర్కొన్నారు పోలీస్ అసోసియేషన్ అధికారులు.
చిత్తూరులో వైసీపీ నాయకుడు ఎంసీ విజయా నంద రెడ్డి బర్త్ డే సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణ వివాదంపై చట్టపరంగా పోలీసులు వ్యవహారిస్తే టూటౌన్ సీఐ, ఎస్ఐలపై విజయా నంద రెడ్డి వ్యక్తిగత దూషణలు చేయడం, అశ్లీల వ్యాఖ్యలకు పాల్పడటం పోలీసు శాఖ గౌరవాన్ని దిగజారుస్తోందని పోలీస్ అసోసియేషన్ అధికారులు చెప్పుకొచ్చారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్‌మెన్ దిండ్లు, దుప్పట్లు మోసుకెళ్లడంపై గన్‌మెన్‌ను సస్పెండ్ చేస్తే భూమన కరుణాకర్ రెడ్డి చిత్తూరు ఎస్పీపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు.
చిత్తూరు జిల్లా పోలీసు శాఖ అన్ని విధాలా చట్టబద్ధంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు అనుచిత వ్యాఖ్యల ద్వారా పోలీసు వ్యవస్థ మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ నేతలు ప్రవర్తించకూడదని హితవు పలికారు. పోలీసు వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చే తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని పోలీస్ అసోసియేషన్ అధికారులు హెచ్చరించారు.