ఆఫ్రికాలో ఒక వినూత్నమైన, ప్రపంచంలోనే అరుదైన పర్యావరణ ప్రాజెక్ట్ కొనసాగుతోంది. స్టీల్, కాంక్రీట్ లేకుండా, చెట్లతోనే ఒక భారీ గోడను నిర్మిస్తున్నారు. దీనిని 'గ్రేట్ గ్రీన్ వాల్'గా పిలుస్తున్నారు. ఈ గ్రీన్ వాల్ ప్రాజెక్టు సెనెగల్ నుంచి జిబౌటీ వరకు సుమారు 8,000 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభం 2007లో జరిగింది. దీనివల్ల సహారా ఎడారి విస్తరణను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే సమయంలో పర్యావరణ పునరుద్ధరణ, వాతావరణ మార్పుల్ని తట్టుకోవడంలో సహాయపడేలా చేస్తోంది.
ప్రాజెక్టు మొత్తం 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాని పరిధిలో 100 మిలియన్ హెక్టార్ల భూమిని అటవీ ప్రాంతాలుగా పునరుద్ధరించనున్నారు. అంతేకాదు, దీనివల్ల దాదాపు 10 మిలియన్ల మంది స్థానికులకు ఉపాధి కల్పన జరుగుతుంది. ఇప్పటికే సెనెగల్ దేశం ఇందులో మంచి పురోగతి సాధించింది. దాదాపు 11 మిలియన్ మొక్కలు నాటి ముందుండుతోంది.
ఈ చెట్ల గోడకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మట్టి నాణ్యత మెరుగవుతుంది, వర్షపాతం పెరుగుతుంది, వ్యవసాయం, పశుపోషణకు ఉపయోగపడుతుంది. పచ్చదనం పెరిగిన చోట జీవవైవిధ్యం పెరిగి, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇది పర్యావరణ పరిరక్షణలో ఒక ప్రపంచానికే ఆదర్శంగా నిలవనుంది.