-వెంకట రామన్ 
ఆక్లాండ్ 
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి అవసరమైన "రిసోర్స్ కన్సెంట్"ను ఆక్లాండ్ కౌన్సిల్ మంజూరు చేసింది. దక్షిణ ఆక్లాండ్ ప్రాంతంలో రామారామా అనే శాంతియుత పల్లెటూరిలో ఈ ఆలయాన్ని నిర్మించేందుకు శిరిగిరి ట్రస్ట్ చేస్తున్న ప్రయత్నాలకు ఇది ఒక గొప్ప ముందడుగు. ఈ అనుమతిని పొందేందుకు ట్రస్ట్ గత మూడేళ్లుగా శ్రమించింది. అనేక సమావేశాలు, డిజైన్ మార్పులు, ప్రజా వినతులు, పబ్లిక్ హియరింగ్స్ వంటి దశలన్నీ అధిగమించి చివరకు ఈ అనుమతి లభించింది.
శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం అనేది ట్రస్ట్ ఛైర్మన్ ఇంద్ర శిరిగిరి వారి కుటుంబ కల మాత్రమే కాదు, ఆక్లాండ్ హిందూ సమాజపు అనేక దశాబ్దాల కల. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమానంగా ఉండే ప్రదేశాన్ని ఎంపిక చేయాలన్న లక్ష్యంతో 100కు పైగా ప్రదేశాలు పరిశీలించి, చివరకు రామారామా నే ఎంపిక చేశారు. అక్కడి భౌగోళిక పరిస్థితులు, ఉత్తరం నుండి తూర్పునవైపు వంపుగా ఉండడం తదితర అంశాలు తిరుమల ఆలయంతో సాదృశ్యం కలిగి ఉన్నాయి.
ఈ ఆలయం కేవలం పూజలకే కాకుండా, హిందూ సంప్రదాయాలను ప్రదర్శించే ఒక సాంస్కృతిక కేంద్రంగా మారనుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు, వార్షికోత్సవాలు, భజనలు, ధార్మిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే యోగా, ధ్యానం, సంగీతం, నాట్యం వంటి కార్యక్రమాలకు కూడా ఇది వేదిక కానుంది. యువతకు హిందూ సంప్రదాయాలపై అవగాహన పెరిగేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. నిర్మాణంలో వాస్తు, శిల్పకళల నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఇది హిందూ సమాజానికి ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక బలాన్ని ఇస్తుంది. భవిష్యత్తు తరాలకు వారసత్వంగా ఉండేలా, సమాజంలో మానవతా విలువలను పెంపొందించేలా ఈ ఆలయం రూపుదిద్దుకోనుంది. ఆక్లాండ్‌లోని హిందూ భక్తులు ఇప్పుడు ఈ ఆలయ ప్రారంభోత్సవానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తిరుమల తిరుపతి ఆలయపు పవిత్రతను ఆక్లాండ్‌కు తీసుకురావాలన్న కల ఇప్పుడు నెరవేరే దశలోకి అడుగుపెట్టింది.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        