గుంటూరు వాసుల ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెరపడింది. నందివెలుగు రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ నుంచి నందివెలుగు రహదారిపై ఈ వంతెన నిర్మాణం జరుగుతోంది. 2018లో టీడీపీ ప్రభుత్వం ఈ పనులు మొదలుపెట్టింది. కానీ వైసీపీ పాలనలో నిధుల సమస్యల కారణంగా ప్రాజెక్టు నిలిచిపోయింది.

ఇప్పుడు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవతో, కేంద్ర నిధులు మంజూరవడంతో కాంట్రాక్టర్ పనులు మళ్లీ మొదలుపెట్టారు. ఇప్పటికే వంతెనపై నిలిచిపోయిన పిల్లర్ల నిర్మాణం కొనసాగుతోంది. ఇన్నేళ్ల తర్వాత పనులు పునఃప్రారంభం కావడంతో స్థానికులు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా వంతెన పూర్తయి అందుబాటులోకి రావాలని కోరుతున్నారు.

ఈ ఆర్వోబీ నిర్మాణానికి 2014లో అనుమతి లభించగా, 2018లో రూ.17 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో కేంద్రం రూ.6 కోట్లు, రాష్ట్రం రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే రాష్ట్రం నుంచి నిధులు సమయానికి రాకపోవటంతో ప్రాజెక్టు సగం వద్దే ఆగిపోయింది.

ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే టెండర్లు ఖరారు చేసి పనులు వేగవంతం చేస్తోంది. 850 మీటర్ల పొడవు, 7.5 మీటర్ల వెడల్పుతో రెండు వరుసలుగా వంతెన నిర్మించబడనుంది. రెండు వైపులా నడకదారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఏడాదిలోగా పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గుంటూరు – తెనాలి మార్గంలో రైళ్ల రాకపోకలు పెరిగిన నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు ఈ ఆర్వోబీ కీలకం కానుంది.