బాపట్ల జిల్లాలో జరిగిన క్వారీ దుర్ఘటనపై ఇద్దరు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్వారీ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించడం పట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
మరో మంత్రి కొలుసు పార్థసారథి కూడా ఈ ప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని బాపట్ల కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గాయపడిన కార్మికులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
బల్లికురవ సమీపంలోని సత్యక్రిష్ణ గ్రానైట్ క్వారీలో ఆదివారం ఉదయం బండరాళ్లు కూలి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు క్వారీలో మొత్తం 16 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గాయపడిన వారిని వెంటనే నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు.
వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. మరణించిన కార్మికులు ఒడిశాకు చెందినవారుగా గుర్తించారు. క్వారీ యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలను పాటించలేదని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.