అమరావతి: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో సమస్యలంటూ సాక్షి పత్రికలో రాసిన వార్తలపై బీసీ
సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పందించారు. ఐదేళ్లలో జగన్ చేసిన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. 
సంక్షేమ హాస్టళ్లలో సమస్యలున్నాయని మూడు రోజులుగా ఆ పత్రికలో అడ్డగోలుగా రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో బీసీ హాస్టళ్ల అభివృద్ధిని జగన్ విస్మరించి నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో తాము బీసీ హాస్టళ్లను అభివృద్ధి చేశామన్నారు. "గత ఐదేళ్లలో పెండింగ్లో ఉన్న పనులను, సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించింది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలే సొంత నిధులతో హాస్టళ్లను అభివృద్ధి చేశారు. వైకాపా హయాంలో పెండింగ్లో పెట్టిన డైట్ బిల్లులు, కాస్మోటిక్ ఛార్జీలు, మరమ్మతుల బిల్లులు చెల్లించాం.
పిల్లలకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశాం. ఐదేళ్లపాటు బీసీ హాస్టళ్లను గాలికొదిలేసిన జగన్కు.. అధికారం కోల్పోగానే అవి గుర్తుకొచ్చాయా? హాస్టళ్లలో అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో చర్చించేందుకు సిద్ధం. వైకాపా నేతలు, జగన్కు నీతి, నిజాయతీ ఉంటే అభివృద్ధిపై చర్చించేందుకు ముందుకు రావాలి" అని మంత్రి సవిత సవాల్ విసిరారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        