తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసానికి బాంబు పెట్టినట్టు వచ్చిన బెదిరింపు కాల్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. అయితే విస్తృతంగా సోదాలు నిర్వహించిన పోలీసులు చివరికి ఇది తప్పుడు బెదిరింపేనని స్పష్టం చేశారు.
ఆదివారం ఉదయం చెన్నై పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చి, అల్వార్‌పేటలోని సీఎం నివాసంలో బాంబు పెట్టినట్టు తెలిపాడు. వెంటనే అలర్టైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్ సహాయంతో సీఎం నివాసాన్ని చుట్టుముట్టి లోపల బయట భద్రతను బలోపేతం చేశారు. సుమారు గంటన్నర పాటు నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.
ఈ నకిలీ కాల్ వెనుక ఎవరు ఉన్నారు? కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు.
ఇదే తరహాలో ఇటీవల తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ నివాసానికీ ఇలాంటే బెదిరింపు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. రెండు ఘటనల మధ్య సంబంధాల కోణంలోనూ విచారణ సాగుతోంది.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        