దుబాయ్‌లో శుక్రవారం చోటుచేసుకున్న తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదం దేశాన్ని షాక్‌కి గురి చేసింది. అత్యంత వేగంగా నేలకి దగ్గరగా జరిగే డెమోలో పాల్గొంటున్న సమయంలో తేజస్ నియంత్రణ కోల్పోయి నేలపై పడిపోవడంతో 34 ఏళ్ల వింగ్ కమాండర్ నమన్ ష్ సయాల్ దుర్మరణం పాలయ్యారు. AI మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మధ్యాహ్నం 2:10 గంటలకు జరిగిన ఈ ప్రమాదాన్ని భారత వాయుసేన ధృవీకరించింది.
ఈ ఘటన మళ్లీ ప్రపంచవ్యాప్తంగా గతంలో జరిగిన ఎయిర్‌షోలు, యుద్ధవిమాన ప్రదర్శనల్లో చోటుచేసుకున్న ప్రాణాంతక ఘటనల్ని గుర్తుకు తెచ్చింది. అత్యున్నత నైపుణ్యం ఉన్న పైలట్లు కూడా క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
పోలాండ్ ఎయిర్‌షో, 2025
ఈ ఏడాది ఆగస్టులో పోలాండ్‌లో జరిగిన రాదోమ్ ఎయిర్‌షో రిహార్సల్‌లో ఎఫ్–16 యుద్ధవిమానం కఠినమైన టర్న్ ప్రయత్నించే సమయంలో నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. పైలట్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు రెండు నెలలకే తేజస్ ప్రమాదం సంభవించడం ఆందోళన పెంచుతోంది.
పాకిస్థాన్ డే ఎయిర్‌షో, 2020
ఇస్లామాబాద్ సమీపంలోని అడవిలో ఎఫ్–16 జెట్ కూలిపోవడంతో వింగ్ కమాండర్ నోమాన్ అక్ఱం ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ డే పరేడ్ కోసం జరుగుతున్న రిహార్సల్ మధ్యలో ఈ దుర్ఘటన జరిగింది.
ఇంగ్లాండ్‌లోని షోరమ్ ఎయిర్‌షో, 2015
ఇటీవలి దశాబ్దాలలో అత్యంత భయానక ప్రమాదాల్లో ఇది ఒకటి. హాకర్ హంటర్ యుద్ధవిమానం ప్రధాన రహదారిపై కూలిపోవడంతో 11 మంది మృతి చెందగా, 16 మందికి పైగా గాయపడ్డారు. పైలట్ ప్రాణాలతో బయటపడినా, తీవ్రంగా గాయపడ్డాడు.
బోర్న్‌మౌత్ ఎయిర్‌ఫెస్టివల్, 2011
రెడారో ఆర్ట్ ఫ్లైయింగ్ టీమ్‌కు చెందిన పైలట్ జాన్ ఎగ్గింగ్, ప్రదర్శన సమయంలో విమానం నేలపై పడిపోవడంతో మృతి చెందాడు. దర్యాప్తులో ఆయన అపస్మారక స్థితికి చేరినట్టు బయటపడింది.
స్క్‌నైలివ్ ఎయిర్‌షో, 2002 – ప్రపంచంలోని అత్యంత ఘోర ప్రమాదం
ఉక్రెయిన్‌లోని ఈ ఘటనను ఇంతవరకు జరిగిన ఎయిర్‌షో ప్రమాదాల్లో అత్యంత భయంకరమైనదిగా భావిస్తారు. సు–27 విమానం అకస్మాత్తుగా ప్రేక్షకులపై కి దూసుకెళ్లడంతో 77 మంది మృతి చెందగా, 500 మందికి పైగా గాయపడ్డారు. పైలట్లు మాత్రం ఈజెక్ట్ అయ్యి బ్రతికిపోయారు.
రామ్‌స్టీన్ ఎయిర్‌షో, 1988
ఇటాలియన్ ఎయిర్‌ఫోర్స్ టీమ్ ఫార్మేషన్ ఫ్లైయింగ్ సమయంలో మూడు విమానాలు ఢీకొనడంతో 67 మంది ప్రేక్షకులు, ముగ్గురు పైలట్లు మృతి చెందారు. ఇది యూరప్ చరిత్రలో అత్యంత విషాదకర ఘటనలలో ఒకటిగా నిలిచింది.
పారిస్ ఎయిర్‌షో, 1973
సుపర్సోనిక్ టూపోలెవ్ Tu-144 డెమో ఫ్లైట్ సమయంలో గాల్లోనే విరిగిపోయి నేలపై పడిపోయింది. ఈ ఘటన ఆ విమాన అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేసింది.
తాజాగా జరిగిన తేజస్ ప్రమాదం ఈ గత ఘటనలను మరోసారి ప్రపంచం ముందుకు తెచ్చింది. అత్యాధునిక సాంకేతికత ఉన్న విమానాలైనా, అత్యుత్తమంగా శిక్షణ పొందిన పైలట్లైనా ఎయిర్‌షో ప్రదర్శనలు అత్యంత ప్రమాదకరమైనవేనని మళ్లీ నిరూపితమైంది.