Chicken Rates Telugu States: ఆదివారం వచ్చిందంటే చాలు ముక్క లేనిదే ముద్ద దిగని మాంసం ప్రియులకు ఇప్పుడు చికెన్ ధరలు గట్టి షాక్ ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో చికెన్ ధర ఏకంగా రూ. 400 మార్కును తాకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అటు చికెన్ మాత్రమే కాకుండా, మటన్ ధరలు కూడా వెయ్యి రూపాయల వైపు పరుగులు తీస్తుండటంతో సామాన్యులు మాంసం దుకాణాల వైపు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.
ఈ అమాంతం పెరుగుదలకు వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షల అనంతరం మాంసాహారానికి ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల మార్కెట్‌లో చికెన్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగాయి.
మరోవైపు వేసవి తాపం కోళ్ల పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కోళ్ల ఫారాలలో కోళ్లు భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. గతంలో లక్ష కోళ్లు పెంచే చోట, ఇప్పుడు కేవలం 50 వేల కోట్లను మాత్రమే పెంచుతున్నారు. ఎండలు ముదురుతుండటంతో కోళ్ల పెంపకందారులు కూడా కొత్త బ్యాచ్‌లు వేయడానికి వెనకాడుతున్నారు.
కేవలం డిమాండ్ మాత్రమే కాకుండా, కోడి పిల్లల ధరలు కూడా పెరగడం పెంచేవారికి భారంగా మారింది. గతంలో రూ. 45 ఉన్న ఒక్కో కోడి పిల్ల ధర ఇప్పుడు రూ. 61కి చేరింది. దీనికి తోడు కోళ్ల దానా, విద్యుత్ మరియు కూలీల ఖర్చులు పెరగడంతో వ్యాపారులు కూడా ధరలు పెంచక తప్పడం లేదని చెబుతున్నారు. ఈ అదనపు భారం అంతా చివరకు వినియోగదారుడి నెత్తినే పడుతోంది.
ప్రస్తుతం విజయవాడలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 400 వరకు పలుకుతుండగా, హైదరాబాద్‌లో రూ. 350కి పైగానే విక్రయిస్తున్నారు. డ్రెస్డ్ చికెన్ ధరలు రూ. 300 దరిదాపుల్లో ఉండగా, లైవ్ బర్డ్ ధరలు కూడా రూ. 200 దాటేశాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత ముదిరితే ఈ ధరలు ఇంకెంత పెరుగుతాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.