AP Transco Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలో ఇంధన రంగంలో ఒక పెద్ద ముందడుగు వేయబోతోంది. రాష్ట్రంలో సుమారు రూ. 40 వేల కోట్ల భారీ వ్యయంతో విద్యుత్ సరఫరా వ్యవస్థను విస్తరించడానికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. దీనికి సంబంధించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (CERC) ఇప్పటికే పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు తీరడమే కాకుండా, ఇతర రాష్ట్రాలకు కూడా విద్యుత్తును ఎగుమతి చేసే అవకాశం కలుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి దేశవ్యాప్తంగా 5 లక్షల మెగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఏపీలో గాలి, సౌర పంప్డ్ స్టోరేజ్ ద్వారా దాదాపు 88 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇంత భారీ స్థాయిలో తయారయ్యే కరెంటును గ్రిడ్‌కు అనుసంధానం చేయాలంటే పటిష్టమైన లైన్లు అవసరం. అందుకే ఈ 40 వేల కోట్ల రూపాయలను కొత్త లైన్లు సబ్‌స్టేషన్ల నిర్మాణం కోసం ఖర్చు చేయనున్నారు.
ఈ నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం కీలక కేంద్రంగా మారబోతోంది. మెజారిటీ విద్యుత్ ప్రాజెక్టులు ఇక్కడే వస్తుండటంతో, కర్నూలు అనంతపురం జిల్లాల్లో భారీ సబ్‌స్టేషన్లను నిర్మించనున్నారు. కర్నూలు-3, కర్నూలు-4, అనంతపురం ఎన్పీ కుంట వంటి ప్రాంతాల్లో అత్యాధునిక పూలింగ్ సబ్‌స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో సబ్‌స్టేషన్ నిర్మాణానికే దాదాపు 1,200 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కేవలం ఇళ్లకే కాకుండా, రాష్ట్రానికి వస్తున్న పెద్ద పెద్ద ఐటీ కంపెనీలకు కూడా ఈ ప్రాజెక్టు ఎంతో మేలు చేస్తుంది. విశాఖపట్నంలో గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలు ఏర్పాటు చేస్తున్న భారీ డేటా సెంటర్లకు నిరంతరాయంగా విద్యుత్ అందించడం ఈ నెట్‌వర్క్ ప్రధాన ఉద్దేశం. ఒకవైపు కేంద్ర సంస్థ పీజీసీఐఎల్ పనులు చేస్తుండగా, మరోవైపు రాష్ట్ర ట్రాన్స్‌కో కూడా తన వంతుగా రూ. 21,500 కోట్లతో తన పరిధిలోని లైన్లను ఆధునీకరించే పనిలో పడింది.
వచ్చే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో ఒక హబ్‌గా మారబోతోంది. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటుందని కేంద్రం నమ్మకం ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన పెరగడమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని నిపుణులు భావిస్తున్నారు.