ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన శోభా గ్రూప్ ఛైర్మన్ పీఎన్సీ మీనన్‌ను కలిశారు. ఈ సమావేశంలో శోభా గ్రూప్ సంస్థ అమరావతిలో ఒక ప్రపంచ స్థాయి లైబ్రరీ నిర్మాణానికి రూ.100 కోట్లు విరాళంగా ఇవ్వాలని ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు వారిని అభినందించి, ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.
అమరావతిలో ఆధునిక గ్రంథాలయాన్ని నిర్మించాలనే ప్రణాళికకు ఇది ఒక పెద్ద ఊతం అని సీఎం తెలిపారు. పేదరిక నిర్మూలనకు, విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన మీనన్‌కు వివరించారు. శోభా గ్రూప్ ఫౌండర్‌కు అమరావతిని సందర్శించి, భవిష్యత్ పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని ఆహ్వానించారు.
చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రహదారులు, నీటి సదుపాయాలు, నైపుణ్యమున్న మానవ వనరులు వంటి మౌలిక సదుపాయాలను వచ్చే మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. విశాఖలో గూగుల్ డేటా ఏఐ హబ్, అమరావతిలో క్వాంటం వ్యాలీ వంటి ప్రాజెక్టులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు.
శోభా గ్రూప్ లైబ్రరీ నిర్మాణానికి రూ.100 కోట్లు విరాళం ఇవ్వడం రాష్ట్ర విద్యా రంగానికి మైలురాయిగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు. అమరావతిలో రూ.150 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాల లైబ్రరీ నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ లైబ్రరీని 24 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదే తరహాలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త జిల్లాల వారీగా కూడా లైబ్రరీల అభివృద్ధి కోసం విరాళాలు స్వీకరించనుంది. ఇప్పటికే విశాఖపట్నంలో రూ.20 కోట్లతో మోడల్ లైబ్రరీ నిర్మాణానికి చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రయత్నాలతో ఆంధ్రప్రదేశ్ విద్యా మౌలిక సదుపాయాల్లో దేశంలో ముందంజలో నిలవనుందని అధికారులు ఆశిస్తున్నారు.