ఆంధ్రప్రదేశ్‌ను క్రీడల రంగంలో అగ్రగామిగా నిలపాలని లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ఈ దిశగా ప్రపంచస్థాయి క్రీడా మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించింది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానాలు, శిక్షణా కేంద్రాలు, కమ్యూనిటీ క్రీడా సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్చర్ సంస్థ “పాపులస్” ప్రతినిధులతో చర్చలు జరిపారు.
పాపులస్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా క్రీడా మౌలిక వసతుల రూపకల్పనలో విశేష అనుభవం ఉంది. గత 40 ఏళ్లలో ఈ సంస్థ 3,500కు పైగా అంతర్జాతీయ ప్రాజెక్టులను డిజైన్ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం, లండన్ ఒలింపిక్ స్టేడియం, న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియం వంటి ప్రఖ్యాత మైదానాలు ఈ సంస్థ సృజనాత్మక ప్రతిభకు నిదర్శనం. ప్రస్తుతం భారత్‌లో ఎల్ అండ్ టీ సంస్థతో కలిసి పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పనిచేస్తోంది.
బ్రిస్బేన్‌లో జరిగిన సమావేశంలో పాపులస్ సంస్థ సీనియర్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ షాన్ గల్లఘర్, ఆసియా పసిఫిక్ బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ ఎలిజిబెత్ డిసిల్వాతో మంత్రి లోకేశ్ విశదంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో క్రీడా రంగానికి కొత్త ఊపిరి పోస్తున్నాం. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల ద్వారా ప్రపంచ క్రీడా మ్యాప్‌పై ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని సంకల్పించాం” అన్నారు.
ఇకపుడు పర్యావరణ హితమైన, ఇంధన సామర్థ్యం గల స్పోర్ట్స్ స్టేడియాలు, శిక్షణా కేంద్రాలు, ఈవెంట్ వేదికల రూపకల్పనలో పాపులస్ సంస్థ భాగస్వామ్యం కోరారు. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు కమ్యూనిటీ క్రీడా సముదాయాల నిర్మాణం, పర్యాటకాభివృద్ధి, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకరించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పాపులస్ సంస్థ ప్రతినిధులు కూడా ఆంధ్రప్రదేశ్ క్రీడా అభివృద్ధి యజ్ఞంలో భాగస్వామ్యం కావాలనే ఆసక్తి వ్యక్తం చేశారు.