దేశవ్యాప్తంగా క్యాబ్ సేవల రంగంలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబర్ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రయాణికులు, డ్రైవర్లకు రెండింటికీ లాభదాయకమైన విధానాన్ని రూపొందిస్తూ ‘భారత్ ట్యాక్సీ’ అనే కొత్త రైడ్‌హెయిలింగ్ సేవను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. కేంద్ర సహకార శాఖ, జాతీయ ఈ-గవర్నెన్స్ విభాగం (NeGD) కలిసి ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సేవ సహకార పద్ధతిలో నడుస్తుంది. ‘భారత్ ట్యాక్సీ’ ద్వారా డ్రైవర్లు ఇకపై కమీషన్ల బారిన పడరని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రతి రైడ్‌పై డ్రైవర్ల నుంచి 25 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తున్నాయి. దీంతో చాలామంది డ్రైవర్లు రోజువారీ ఆదాయం తగ్గిపోతుందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, రద్దీ సమయాల్లో సర్జ్ ప్రైజింగ్ పేరిట ప్రయాణికులపై కూడా అధిక ఛార్జీలు మోపుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కొత్త నమూనా ఆవిష్కరించింది. ఇందులో డ్రైవర్లు కేవలం రోజువారీ లేదా నెలవారీ సభ్యత్వ రుసుము చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల ప్రతీ రైడ్‌పై వచ్చే ఆదాయం మొత్తం వారికే లభిస్తుంది.
‘భారత్ ట్యాక్సీ’ సేవను అమలు చేయడానికి రూ.300 కోట్ల మూలధనంతో ‘సహకార్ ట్యాక్సీ కో-ఆపరేటివ్ లిమిటెడ్’ను స్థాపించారు. మొదటి దశలో ఈ సేవను నవంబర్ నుంచి దిల్లీలో 650 క్యాబ్‌లతో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభిస్తారు. ఆపై డిసెంబర్లో ముంబై, పుణె, భోపాల్, జైపూర్ వంటి 20 ప్రధాన నగరాలకు విస్తరించనున్నారు. క్రమంగా 2026 మార్చి నాటికి దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ‘భారత్ ట్యాక్సీ’ సేవ అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కేవలం డ్రైవర్లకే కాదు, ప్రయాణికులకు కూడా తక్కువ ఛార్జీలతో నాణ్యమైన సేవలు అందించాలన్నదే లక్ష్యం.
కేంద్రం దీన్ని డిజిటల్ ఇండియా మిషన్ లో భాగంగా చూస్తోంది. 2030 నాటికి దేశవ్యాప్తంగా లక్ష మంది క్యాబ్ డ్రైవర్లను ఈ ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానం చేయాలనే భారీ ప్రణాళిక ఉంది. దీంతో కోట్లాది రూపాయల ఆదాయం నేరుగా డ్రైవర్ల చేతుల్లోకే చేరుతుందని అంచనా. ప్రైవేట్ యాప్‌లలో ఉన్న మోనోపొలీని తగ్గిస్తూ, పారదర్శకమైన సేవలను అందించే దిశగా ‘భారత్ ట్యాక్సీ’ పెద్ద మైలురాయిగా నిలవవచ్చని అధికారులు అంటున్నారు.