బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వేడి పెరిగింది. ఈ క్రమంలో బీజేపీ, జెడీయూ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. రెండు పార్టీలూ తలా 101 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి. ఈసారి ఇరుపార్టీలు మహిళలు, ఓబీసీ (వెనుకబడిన వర్గాలు) ఈబీసీ (అత్యంత వెనుకబడిన వర్గాలు)లపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.
బీజేపీ ఈసారి 55 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలకు మళ్లీ అవకాశం ఇచ్చింది. 16 మందిని మార్చేసి, కొత్తగా 30 మందికి అవకాశం కల్పించింది. వీరిలో యువ నాయకులు, సామాజిక కార్యకర్తలు, మాజీ అధికారులు, కళారంగం వ్యక్తులు ఉన్నారు.
మొత్తం 101 సీట్లలో 13 మహిళలకు టిక్కెట్లు ఇచ్చారు. అంటే సుమారు 13 శాతం మహిళా ప్రాతినిధ్యం. ఈ జాబితాలో ముస్లిం అభ్యర్థులు లేరు. పార్టీ వర్గాల సమతుల్యతను కాపాడుతూ ఓబీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, పైవర్గాల వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చింది.
ఉపముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి (తారాపూర్), విజయ్ సింహా (లఖీ సరాయ్) నుంచి పోటీ చేస్తున్నారు.మాజీ డిప్యూటీ సీఎంలు తర్కీశోర్ ప్రసాద్ (కటిహార్), రేణు దేవి (బెట్టియా) కూడా మళ్లీ రంగంలోకి దిగారు.
మైథిలీ గాయని మైథిలీ ఠాకూర్ (అలీనగర్), మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా(బక్సర్), దళిత నాయకుడు సుజిత్ పాస్వాన్ (రాజ్నగర్ – ఎస్సీ) ప్రధానంగా చర్చలో ఉన్నారు.
జెడీయూ కూడా మొత్తం 101 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో 59 సీట్లు ఓబీసీలు, ఈబీసీలకు కేటాయించింది. వీరిలో 22 మంది ఈబీసీలు, 13 మంది కుష్వాహాలు, 12 మంది కుర్మీలు ఉన్నారు – వీరు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మద్దతు వర్గాలు.
మహిళలకు 13 సీట్లు ఇచ్చింది. 2020తో పోలిస్తే ఈసారి ముస్లిం అభ్యర్థులు తగ్గించారు – ఈసారి కేవలం 4 మందికి మాత్రమే అవకాశం లభించింది. రిజర్వ్డ్ (SC) సీట్లలో మూసహార్, రవిదాసి, పాస్వాన్ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
ఈసారి జెడీయూ స్పష్టంగా ఈబీసీ, కుష్వాహా, కుర్మీ వర్గాల మద్దతు పటిష్టం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. నితీశ్ కుమార్ ఎప్పటిలాగే సామాజిక సమతుల్యతపై దృష్టి పెట్టారు. మరోవైపు బీజేపీ కూడా మహిళల ప్రాతినిధ్యం పెంచి, కొత్త నాయకులను ముందుకు తెచ్చింది.
రెండు పార్టీలూ కలిసి మహాగఠబంధన్ కూటమి (ఆర్జేడీ, కాంగ్రెస్) మరియు ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ ప్రభావాన్ని ఎదుర్కొనాలని యోచిస్తున్నాయి.
మొత్తానికి, బీహార్ ఎన్నికలు ఈసారి వర్గ సమీకరణాలు, మహిళా శక్తి, యువత ప్రతినిధిత్వం చుట్టూ తిరుగుతున్నాయి. ఎవరి వ్యూహం ఫలిస్తుందో నవంబర్ పోలింగ్నే నిర్ణయించబోతోంది.