భారత్, అఫ్గానిస్తాన్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం పరిస్థితులు కొత్త మలుపు తిరుగుతున్నాయి. పాకిస్థాన్ తన భూభాగంలో తహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఉగ్రవాదులపై దాడులు చేయడంతో అఫ్గానిస్తాన్ తీవ్రంగా స్పందించింది. అఫ్గాన్ తాలిబన్లు తమ సరిహద్దుల్లో పాక్ సైనికుల దాడిని భరించలేక, ప్రతీకారంగా పాకిస్థాన్ చెక్‌పోస్టులు, ట్యాంకులను ధ్వంసం చేసి యుద్ధరంగాన్ని వేడెక్కించారు. ఈ నేపథ్యంలో భారతదేశం అఫ్గానిస్తాన్‌కు మద్దతుగా నిలవడం అంతర్జాతీయ వేదికపై పెద్ద చర్చగా మారింది.
చాణక్యుడు చెప్పినట్లుగా “శత్రువుకు శత్రువు మన మిత్రుడు” అనే సూత్రాన్ని భారత్ ఇప్పుడు బలంగా వినియోగిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్థాన్ ఎప్పటి నుంచీ భారత్‌కు శత్రువుగా వ్యవహరిస్తూ, ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోంది. ఇప్పుడు అదే పాకిస్థాన్ అఫ్గాన్ తాలిబన్ల చేతిలో చిక్కుకోవడంతో భారత్ మౌనంగా సంతోషిస్తోంది. అంతేకాకుండా, భారత్ అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి సహాయం అందజేస్తూ, అక్కడి ప్రజల పట్ల మానవతా దృక్కోణం ప్రదర్శిస్తోంది. ఈ చర్యతో పాకిస్థాన్ పూర్తిగా కోణర్లో పడిపోయింది.
అఫ్గానిస్తాన్ మరియు పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం సృష్టించడానికి ప్రధాన కారణం TTP నాయకుడు. అతన్ని తాలిబన్ ఆశ్రయం ఇస్తోందని ఆరోపిస్తూ పాక్ వైమానిక దాడులు జరపడం, దాంతో పది మందికి పైగా అఫ్గాన్ పౌరులు చనిపోవడం పరిస్థితిని మరింత తీవ్రమయ్యేలా చేసింది. ప్రతిగా అఫ్గాన్ సైన్యం పాక్ సరిహద్దు ప్రాంతాలపై దాడి చేసి పాక్ ట్యాంకులను స్వాధీనం చేసుకోవడం గర్వంగా ప్రకటించింది. ఈ ఘటన తర్వాత పాక్‌లో రాజకీయ, సైనిక వర్గాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ఇదే సమయంలో పాకిస్థాన్ తమపై అఫ్గాన్ దాడులకు కారణం భారత్ అని ఆరోపిస్తూ పసలేని వాదనలు చేస్తోంది. భారత్ అఫ్గాన్లను రెచ్చగొడుతోందని, ఆర్థిక సహాయం అందిస్తూ తమపై యుద్ధానికి ప్రేరేపిస్తోందని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. అయితే భారత విదేశాంగ శాఖ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసి, “భారత్ ఎల్లప్పుడూ శాంతి, ప్రజాస్వామ్యానికి మద్దతుగా ఉంటుంది. అఫ్గానిస్తాన్ స్వావలంబన, స్థిరత్వం కోసం సహాయం అందిస్తూనే ఉంటుంది” అని స్పష్టం చేసింది.
ఇక తాలిబన్లు మనకు శత్రువులా అనే ప్రశ్నకు వస్తే చరిత్ర చెబుతున్నది వేరే కథ. 1999లో IC-814 విమానం హైజాక్ ఘటన గుర్తుందా? పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదులు ఆ విమానాన్ని కాంధార్‌లో ల్యాండ్ చేయించారు. ఆ సమయంలో తాలిబన్లు ఆ విమానానికి రక్షణగా నిలబడి, ప్రయాణికులకు హాని కలగకుండా చూసుకున్నారు. అంటే, అఫ్గాన్ తాలిబన్లు అప్పటినుంచీ భారత్‌తో నేరుగా విభేదాలు పెట్టుకోలేదు.
ఇప్పటి పరిస్థితుల్లో భారత్ నేరుగా తాలిబన్ పాలనను అంగీకరించకపోయినా, అఫ్గాన్ ప్రజలకు మానవతా సహాయం అందించడం ద్వారా ఒక రకంగా మద్దతు ఇస్తోంది. ఈ వ్యూహాత్మక చర్యతో పాకిస్థాన్ ఒంటరితనంలో పడిపోతోంది. భారత్–అఫ్గాన్ సాన్నిహిత్యం దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారితీయవచ్చు.
మొత్తం చూస్తే, పాకిస్థాన్ ఇప్పుడే అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది తమ చేతులతో సృష్టించిన ఉగ్రవాదమే, ఇప్పుడు వారి సరిహద్దులను తాకుతోంది. భారత్ మాత్రం శత్రువుల బలహీనతను వ్యూహాత్మకంగా ఉపయోగించి, అఫ్గాన్ సపోర్ట్‌తో పాక్‌కు చావుదెబ్బ ఇచ్చింది.