ముఖ్యఅతిథిగా పాల్గొన్న హోం మంత్రి అనిత..
పాల్గొన్న డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్..
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రాసిక్యూషన్ విభాగం ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా మరియు బానిస కార్మిక వ్యవస్థ (రద్దు) చట్టం, 1976 పై ఒకరోజు వర్క్‌షాప్ విశాఖపట్నంలో నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 మంది ప్రాసిక్యూషన్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వర్క్‌షాప్‌ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ రామ కోటేశ్వర రావు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, సమాజానికి ఉపయోగపడేలా ఇలాంటి వర్క్‌షాప్‌లు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కు అభినందనలు తెలిపారు. ప్రజల్లో చట్టాలు, న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతోందని చెప్పారు. “పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక గౌరవప్రదమైన బాధ్యత” అని ఆమె అన్నారు.
పోక్సో కేసుల్లో నిందితులకు బెయిల్ రాకుండానే శిక్షలు పడుతున్నాయని ఆమె వివరించారు. పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు సమయానుకూల న్యాయం అందుతుందని స్పష్టం చేశారు.
అదేవిధంగా, ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ ట్రేస్” ద్వారా ఇప్పటివరకు 900 మంది పిల్లలను రక్షించామని వెల్లడించారు. విదేశాల్లో చిక్కుకున్న 180 మంది భారతీయులను కూడా సురక్షితంగా తిరిగి తీసుకువచ్చినట్లు తెలిపారు.
పోలీస్ శాఖలో టెక్నాలజీ వినియోగంపై ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నామని, పోలీసు-న్యాయ వ్యవస్థలు పటిష్టంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని హోంమంత్రి పేర్కొన్నారు.
కార్యక్రమం ముగింపులో వివిధ కేసుల్లో విశేష ప్రతిభ కనబరిచిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌ను హోంమంత్రి అనిత సత్కరించారు. ఈ వర్క్‌షాప్ ద్వారా న్యాయవ్యవస్థ మరింత సమర్థంగా పనిచేసే దిశగా అధికారులకు అవగాహన పెరిగిందని నిర్వాహకులు తెలిపారు.