అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు..
పులివెందుల బస్టాండ్ వద్ద అలజడి.. నిందితులకు పోలీసుల కౌన్సిలింగ్…
హడలెత్తించిన యువకులు.. హడలు పుట్టించిన పోలీసులు!
Pulivendula: పులివెందుల పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ అల్లర్లకు పాల్పడే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు రోజుల క్రితం స్థానిక బస్టాండ్ సమీపంలో మద్యం మత్తులో కర్రలతో హల్చల్ చేస్తూ, స్థానికులను భయభ్రాంతులకు గురిచేసిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్బన్ సీఐ శ్రీరామ్ ఆధ్వర్యంలో ఈ అల్లరి మూకలను రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కు తరలించి, అక్కడ వారికి గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ చర్య ద్వారా పోలీసులు హెచ్చరించారు.
ఈ సందర్భంగా అర్బన్ సీఐ శ్రీరామ్ మాట్లాడుతూ, పట్టణంలో అల్లర్లకు పాల్పడినా లేదా చట్టాన్ని అతిక్రమించినా ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. యువత చెడు వ్యసనాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. నిరంతరం నిఘా కొనసాగుతుందని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల ఈ మెరుపు చర్యతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.