రాజమౌళి మహేశ్ బాబు కలిసి చేస్తున్న ‘వారణాసి’ ప్రాజెక్ట్ ఇప్పుడే భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా, టైటిల్ వివాదం అయితే కొత్త చర్చలకు దారితీసింది. ఈ టైటిల్ ఇప్పటికే TFPCలో రిజిస్టర్ అయి ఉండటం ఇప్పుడు సమస్యగా మారింది. సుబ్బారెడ్డి అనే దర్శకుడు ‘వారణాసి’ టైటిల్‌ను రెండు సంవత్సరాల క్రితమే తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TFPC) లో రిజిస్టర్ చేయించారట. ఇప్పుడు అదే పేరును SSMB29 టీమ్ ఉపయోగించడంతో ఆయన ఫిర్యాదు చేసినట్లు సమాచారం. టైటిల్ పై అధికారికంగా హక్కులు తనకేనని, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నందున రాజమౌళి టీమ్ నుంచి స్పష్టత రావాలని ఆయన కోరుతున్నట్లు తెలుస్తోంది.
అయితే మరో వైపు రాజమౌళి టీమ్ మాత్రం తెలుగులో కాకుండా ఇతర భాషల్లో ‘వారణాసి’ టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం. అందుకే తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌లో కూడా తెలుగు టైటిల్‌ను పూర్తిగా మానుకొని కేవలం ఇంగ్లీష్ టైటిల్‌తోనే రిలీజ్ చేశారని ఇండస్ట్రీలో మాట వినిపిస్తోంది. తెలుగులో టైటిల్ రిజిస్ట్రేషన్ హక్కులు తమవే కాబట్టి, SSMB29 టీమ్ తెలుగులో టైటిల్ ఉపయోగించలేదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో సినిమాలో అధికారిక తెలుగు టైటిల్ మారుతుందా? లేక చర్చల ద్వారా ఈ వివాదం ముగుస్తుందా? అన్న ఆసక్తి పెరుగుతోంది.
ఇండస్ట్రీలో టైటిల్ వివాదాలు కొత్తేమీ కావు. అయితే రాజమౌళి రేంజ్, మహేశ్ బాబు స్టార్డమ్ దృష్ట్యా ఇది సాధారణ విషయంగా మారలేదు. టైటిల్ విషయంలో సంప్రదింపులు జరిగే అవకాశం ఉన్నా, ఎవరి హక్కులు బలంగా ఉన్నాయో TFPC రికార్డుల ఆధారంగా స్పష్టత రావాల్సి ఉంటుంది. ఇక సినిమా ప్రమోషన్స్, బ్రాండింగ్ మొత్తం టైటిల్‌ను ఆధారపడి ఉండటం వల్ల నిర్మాతలకి కూడా ఇది చిన్న సమస్య కాదు. ఒక చిన్న టైటిల్ సమస్య పాన్-ఇండియా సినిమాకి పెద్ద డిలేలకు కారణం అవుతుందేమో అనే ఆందోళన కూడా కొంతమందిలో ఉంది.
మరోవైపు అభిమానులు మాత్రం ఈ వివాదంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి వంటి ఆచితూచి ప్రతి అడుగు వేస్తాడని పేరున్న దర్శకుడు టైటిల్ క్లారిటీ లేకుండా ముందుకు వెళ్లడం ఎందుకని చర్చిస్తోంది. అయితే అధికారికంగా టీమ్ నుంచి ఎలాంటి స్టేట్మెంట్ రాకపోవడంతో ఇంకా స్పష్టత లేదు. చివరికి ఈ వివాదం చర్చలతో పరిష్కారమవుతుందా? లేక SSMB29కి కొత్త తెలుగు టైటిల్ చూస్తామా? అన్నది చూడాలి. ఏదేమైనా ‘వారణాసి’ సినిమా విడుదలకు ముందే ఇలా హాట్ టాపిక్ అవుతోంది.