- Gulf: గల్ఫ్ రిటనీ కుంగుబాటు సమస్యకు ప్రభుత్వం చేయాత…
- ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి స్వయంగా వైద్యుడు కావడంతో ప్రత్యేక శ్రద్ధ..
Gulf Updates: స్వగ్రామంలో కల్తీ కల్లు (గుల్ఫారం) సేవించే అలవాటు వలన దుబాయిలో మానసిక అస్థిరతకు గురైన నిజామాబాద్ జిల్లా డిచుపల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామానికి చెందిన మొద్దు గంగాధర్ హైదరాబాద్ కు చేరిన తర్వాత మానసిక వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
గంగాధర్ ను స్వదేశానికి తెప్పించాలని, వాపస్ వచ్చిన తర్వాత డీ-అడిక్షన్ (వ్యసన విముక్తి) చికిత్స అందించాలని కోరుతూ అతని భార్య సుప్రియ ఈనెల 12న హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్ లో 'సీఏం స్టేట్ లెవల్ ప్రవాసీ ప్రజావాణి' లో వినతిపత్రం సమర్పించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఈమేరకు జిఏడి ఎన్నారై సెల్ అధికారులకు లేఖ రాశారు.
మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం, 2017 నిబంధనల ప్రకారం... మొద్దు గంగాధర్ ను హైదరాబాద్ లోని మానసిక ఆరోగ్య సంస్థలో చేర్చుకొని చికిత్స అందిస్తామని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సూపరింటెండెంట్ ఈ నెల 22న ఎన్ఓసీ జారీ చేశారు.
"రోగి ఆసుపత్రిలో చేరిన సమయంలో కుటుంబ సభ్యులు లేదా బంధువులు అతనితో ఉండి బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉంటే, మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం, 2017 లోని సెక్షన్ 86 ప్రకారం ఫ్యామిలీ వార్డులో చేర్చవచ్చు. కుటుంబ సభ్యులు క్లోజ్డ్ వార్డులో చేర్పించాలని కోరిన పక్షంలో, అందుకు అవసరమైన మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది." అని ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు.