తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయి నాయకత్వంపై అధిష్టానం కీలక నిర్ణయాల దిశగా ముందడుగు వేసింది. పార్టీ జిల్లా కమిటీల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్రిసభ్య కమిటీలతో విస్తృతంగా చర్చలు జరిపారు. జిల్లాల వారీగా పార్టీ బలోపేతం, సమన్వయం, రాబోయే రాజకీయ అవసరాలపై ఈ సమావేశాల్లో సమగ్రంగా సమీక్ష జరిగినట్లు సమాచారం.
ఈ చర్చల అనంతరం తెలుగుదేశం పార్టీ అధిష్టానం దాదాపు అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులను ఖరారు చేసింది. ఉమ్మడి చిత్తూరు పరిధిలో తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా షణ్ముగం, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ ను నియమించాలని దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈ నియామకాలు స్థానిక రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని చేసినట్లు తెలుస్తోంది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ కీలక నియామకాలు జరిగాయి. విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున, విశాఖ జిల్లా అధ్యక్షుడిగా చోడే పట్టాభిరామ్, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బత్తుల తాతబ్బాయ్ పేర్లు ఖరారయ్యాయి. అలాగే శ్రీకాకుళం సమీప ప్రాంతాల్లో పార్టీ బలోపేతానికి ఈ నియామకాలు దోహదపడతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
మధ్యాంధ్ర జిల్లాల్లో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బడేటి చంటి, కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా జోత్యుల నవీన్, కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా గుత్తుల సాయి, కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా వీరంకి గురుమూర్తి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలిగా గద్దె అనురాధ పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా రామరాజు, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా వెంకటరమణ చౌదరి ఎంపికయ్యారు.
రాయలసీమ మరియు దక్షిణాంధ్ర జిల్లాల్లోనూ పార్టీ నాయకత్వం స్పష్టత వచ్చింది. ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉగ్ర నరసింహారెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యాలరావు, పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా కొమ్మాలపాటి శ్రీధర్, బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా సలగల రాజశేఖర్, అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా కాలవ శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా ఎంఎస్ రాజు, నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా ధర్మవరపు సుబ్బారెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా వహీద్, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా బీదా రవిచంద్ర, కడప జిల్లా అధ్యక్షుడిగా భూపేశ్ రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఈ నియామకాలతో జిల్లా స్థాయిలో టీడీపీ కార్యకలాపాలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.