పెట్స్ మరియు స్పోర్ట్స్ కిట్లకు ఇక ఫిక్స్డ్ ఛార్జీలు…
విమానయాన సంస్థలకు కేంద్రం వార్నింగ్…
ఇక ప్రాంతీయ భాషల్లోనే సమాచారం…
Travel Tips: భారతదేశంలో విమాన ప్రయాణం చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, టికెట్ బుక్ చేసుకునే సమయంలో విమానయాన సంస్థలు వసూలు చేసే వివిధ రకాల అదనపు ఛార్జీలు ప్రయాణికులకు భారంగా మారుతున్నాయి. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్యాసింజర్ ఫస్ట్' (ప్రయాణికుడికే మొదటి ప్రాధాన్యత) విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా సీట్ల ఎంపిక, వెబ్ చెక్-ఇన్ మరియు క్యాన్సలేషన్ నిబంధనలలో భారీ మార్పులు చేసింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం, ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను విమానయాన సంస్థలు ఎటువంటి అదనపు రుసుము లేకుండా ఉచితంగానే అందుబాటులో ఉంచాలి. గతంలో దాదాపు ప్రతి సీటుకు (మిడిల్ సీటుతో సహా) 'సీట్ సెలక్షన్ ఛార్జీ' పేరుతో డబ్బులు వసూలు చేసేవారు. ఇకపై అటువంటి వెబ్ చెక్-ఇన్ ఉచ్చులో ప్రయాణికులు చిక్కుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది సామాన్య ప్రయాణికుల జేబుకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా చెప్పవచ్చు.
కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి మరో శుభవార్త ఏమిటంటే, ఒకే టికెట్ (PNR)పై బుక్ చేసుకున్న ప్రయాణికులను ఒకే దగ్గర కూర్చోబెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పిల్లలు లేదా వృద్ధులతో ప్రయాణించేటప్పుడు వారు వేర్వేరు వరుసలలో కూర్చోవడం వల్ల కలిగే ఇబ్బందులను గమనించిన డీజీసీఏ, సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులందరికీ పక్కపక్కనే సీట్లు కేటాయించాలని స్పష్టం చేసింది. దీనికోసం అదనపు డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు.
విమానం ఆలస్యమైనా లేదా రద్దయినా ప్రయాణికులకు ఉండే హక్కుల గురించి ఇకపై విమానాశ్రయాల్లో స్పష్టంగా ప్రదర్శించాలి. ముఖ్యంగా తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో డిజిటల్ బోర్డులు, మొబైల్ యాప్‌లలో ఈ సమాచారాన్ని ఉంచడం తప్పనిసరి. విమానం ఆలస్యమైతే భోజనం లేదా రీఫండ్ పొందే హక్కు ప్రయాణికుడికి ఉంటుంది. గతంలో ఈ నిబంధనలు క్లిష్టంగా ఉండేవి, కానీ ఇప్పుడు వాటిని పారదర్శకంగా మార్చారు.