కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల పుణ్యక్షేత్రం కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, కోట్లాది మంది భారతీయుల మనోభావాలకు ప్రతీక. అందుకే తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతను కాపాడటం, అక్కడికి వచ్చే భక్తులకు గుండె నిండా భరోసా కల్పించడం తన ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. శుక్రవారం తిరుపతిలో హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా శాంతిభద్రతల విషయంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం. తిరుపతిలో అన్ని హంగులతో, ఆధునిక వసతులతో నిర్మించిన కొత్త జిల్లా పోలీసు కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించి, విజిటర్స్ బుక్‌లో సంతకం చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే తిరుపతి లాంటి చోట ఇలాంటి ఆధునిక కార్యాలయం ఉండటం వల్ల పోలీసుల మధ్య సమన్వయం పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అరాచకాలకు, రౌడీయిజానికి తావులేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ముసుగులో ఎవరైనా నేరాలు చేసినా, సామాన్యులను ఇబ్బంది పెట్టినా సహించేది లేదని హెచ్చరించారు. అరాచక శక్తులు తమ పంథాను మార్చుకోకపోతే, అవసరమైతే వారిని రాష్ట్రం నుండే బహిష్కరించేందుకు కూడా వెనుకాడబోమని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. శాంతిభద్రతల విషయంలో తమది 'జీరో టాలరెన్స్' పాలసీ అని స్పష్టం చేశారు.
నేర నియంత్రణలో పోలీసులు అనుసరించాల్సిన కొత్త వ్యూహాన్ని ముఖ్యమంత్రి వివరించారు. పోలీసులు రోడ్లపై కనిపిస్తూ ప్రజలకు భరోసా ఇవ్వాలి. పోలీసులు ఉన్నారనే ధైర్యం సామాన్యుడికి కలగాలి. నేరస్తులకు మాత్రం పోలీసులు ఎక్కడున్నారో తెలియకూడదు, కానీ వారి ప్రతి కదలికపై నిఘా ఉండాలి. టెక్నాలజీ సాయంతో నేరగాళ్ల ఆలోచనల కంటే ఓ అడుగు ముందుండాలని పోలీసులను కోరారు.
ఆధునిక నేరగాళ్లు టెక్నాలజీని వాడుతున్నప్పుడు, పోలీసులు అంతకంటే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వాడాలని సీఎం సూచించారు. తిరుమల, తిరుపతి వంటి రద్దీ ప్రాంతాల్లో నిరంతరం డ్రోన్ల ద్వారా నిఘా ఉంచాలని ఆదేశించారు. సిసి టీవీ ఫుటేజ్ మరియు కీలక ఆధారాలను సేకరించడంలో సాంకేతికతను జోడించి, నేరస్తులను వేగంగా పట్టుకోవాలని పిలుపునిచ్చారు.
ముంచుకొస్తున్న వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల సమయంలో తిరుమలకు భక్తుల తాకిడి లక్షలాదిగా ఉంటుంది. ఇలాంటి కీలక సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తిరుమలకు వచ్చే భక్తులు భద్రత విషయంలో ఎక్కడా అసౌకర్యానికి గురికాకూడదని, పోలీసుల ప్రవర్తన కూడా భక్తుల పట్ల గౌరవప్రదంగా ఉండాలని సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటనతో తిరుపతి జిల్లా పోలీసు వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, భక్తులకు మెరుగైన సేవలందించడంలో తాము ముందుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో నేరరహిత వాతావరణమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని చంద్రబాబు విమర్శించారు. కొందరు రాజకీయ అండతో చెలరేగిపోయారని, సమాజంలో భయాన్ని సృష్టించే సంస్కృతిని ప్రోత్సహించారని ఆరోపించారు.
"రోడ్లు బ్లాక్ చేయడం, కత్తులతో జంతువులను బలిచ్చి ఆ రక్తంతో పోస్టర్లు నింపడం వంటి భయానక వాతావరణాన్ని సృష్టించారు. బంగారుపాళ్యంలో మామిడి కాయలు తొక్కించడం, గుంటూరులో ఒక వ్యక్తిని కాన్వాయ్ కింద తొక్కించి పొదల్లో పడేసి, తర్వాత అంబులెన్స్‌లో తీసుకెళ్లి చంపేయడం వంటి అమానవీయ ఘటనలు చూశాం. ఇలాంటివి పునరావృతం కాకుండా సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ఆధారాలు పక్కాగా సేకరించాలి" అని పోలీసులకు సూచించారు.