ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు కూడా సమయం కేటాయిస్తున్నారు. తరచూ ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలు, అవసరాలను నేరుగా తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం డిసెంబర్ 29న అమరావతి సచివాలయంలో పలు దేశాలకు చెందిన ఎన్నారైలు సీఎం చంద్రబాబును ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
యూకే, అమెరికా, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఎన్నారైలు ఈ భేటీలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వారిని ఆత్మీయంగా పలకరించి, వారి కుటుంబాల గురించి, వృత్తులు, వారు నివసిస్తున్న దేశాల్లోని పరిస్థితులపై ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో యూకే నుంచి అనిల్ కుమార్ కుర్రా, అమెరికా నుంచి రత్న ప్రసాద్ గుమ్మడి, మొవ్వా శివ సత్యనారాయణతో పాటు వారి కుటుంబ సభ్యులు, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఎన్నారైలు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక, అతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది ఎన్నారైలు ఆసక్తి చూపుతున్నారని వారు సీఎంకు తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక పథకాలు, ప్రోత్సాహకాలు అందిస్తే మరింత మంది ముందుకు వస్తారని చెప్పారు. అలాగే విదేశాల్లో ఉన్న అవకాశాలు తెలుగు యువతకు ఎంతో ఉపయోగపడతాయని, నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టితే అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని సూచించారు.
వారి అభిప్రాయాలకు సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న ఎన్నారైలు స్పష్టమైన, సమగ్ర ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలతో రాష్ట్రానికి ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావడాన్ని ప్రభుత్వం స్వాగతిస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చూపిన ఆత్మీయత తమను ఎంతో ఆకట్టుకుందని ఎన్నారైలు తెలిపారు. ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడే అవకాశం తమ జీవితంలో మరచిపోలేని అనుభవమని వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.