ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వ్యాపారాలను ప్రోత్సహించే క్రమంలో డ్వాక్రా మహిళల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు డ్వాక్రా సంఘాల మహిళలకు రూ. 50,000 విలువైన ఎగ్ కార్ట్‌లను ఉచితంగా అందిస్తోంది. మొదటి విడతలో 250 ఎగ్ కార్ట్‌లు పంపిణీ చేయగా, 2025-26 నాటికి మొత్తం 1,000 ఎగ్ కార్ట్‌లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో కార్ట్ విలువ రూ. 35,000 కాగా, గుడ్ల వంటలకి అవసరమైన రూ. 15,000 విలువైన ఇతర వస్తువులు కూడా అందజేస్తున్నారు.
ఈ పథకం ద్వారా మహిళలు గుడ్లు విక్రయించి నెలకు రూ. 20,000 వరకు ఆదాయం పొందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గుడ్ల వినియోగాన్ని ప్రోత్సహించి, పోషకాహార లోపాన్ని తగ్గించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఈ ప్రయోజనాల కోసం నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ (NECC)తో ఒప్పందం కుదిరింది. మంగళగిరిలో జరిగిన రాష్ట్రస్థాయి ప్రాజెక్ట్ డైరెక్టర్ల సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లబ్ధిదారులకు ఈ కార్ట్‌లను అందజేశారు.
ఇక డ్వాక్రా సంఘాల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కల్పించేందుకు ప్రభుత్వం మరో పథకాన్ని తీసుకొస్తోంది. ‘మన డబ్బులు – మన లెక్కలు’ అనే పేరుతో ఓ మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్నారు. ఈ యాప్ ద్వారా మహిళలు రుణ వివరాలు, వడ్డీ రేట్లు, నెలవారీ చెల్లింపులు తదితర విషయాలపై పూర్తి అవగాహన పొందవచ్చు. ఈ యాప్‌ను గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (SERP) ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్నారు. ప్రతి సంఘ సభ్యురాలికీ ఆర్థిక విద్యను అందించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
అంతేకాదు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి 2.5 లక్షల మహిళా పారిశ్రామికవేత్తలు తయారు కావాలన్న దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ. 30,635 కోట్ల వార్షిక రుణ ప్రణాళికతో సెర్ప్ ఈ లక్ష్యాలను సాధించడానికి పనిచేస్తోంది. రైతు ఉత్పాదక సంఘాలు కేంద్ర నిధులతో బలోపేతం చేయాలని సూచిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఆర్థిక అభివృద్ధికి నూతన దారులు తెరిచేలా ఈ పథకాలు అమలవుతున్నాయి.