నో కింగ్స్ పేరుతో ప్రారంభమైన ఈ నిరసనలు ఇటీవల మరింత వేడెక్కాయి. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్ తీసుకున్న పాలనా నిర్ణయాలు, సంస్కరణల పేరుతో అమలు చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. వలస నియంత్రణ, విద్యా నిధుల కోత, జాతీయ బలగాల మోహరింపు వంటి చర్యలు విస్తృత విమర్శలకు దారితీశాయి.
దేశవ్యాప్తంగా నో కింగ్స్ పేరుతో జరుగుతున్న నిరసనలకు ప్రతిస్పందనగా ప్రజలను వ్యంగ్యంగా చూపించే ఏఐ వీడియోలను ట్రంప్ స్వయంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. వాటిలో ట్రంప్ తలపై కిరీటంతో రాజులా యుద్ధవిమానంలో ప్రయాణిస్తూ నిరసనకారులపై బురద జారవిడుస్తున్నట్లు చూపించారు.
మరొక వీడియోలో డెమోక్రటిక్ కార్యకర్త హ్యారీ సిస్సన్ పాత్రను కూడా వినోదాత్మకంగా మలిచారు. మరోవైపు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ షేర్ చేసిన మరో వీడియోలో ట్రంప్ రాజదుస్తుల్లో కనిపిస్తూ నాన్సీ పెలోసి సహా డెమోక్రటిక్ నేతలు ఆయన ముందు మోకరిల్లుతున్నట్లు ఉంది.
ఏదేమనప్పటికీ ఈ తాజా ఏఐ వీడియోలతో మరోసారి ట్రంప్ సోషల్‌మీడియా దృష్టిని ఆకర్షించారు. విమర్శకులు తీవ్రంగా స్పందిస్తున్నప్పటికీ ఆయన అనుచరులు మాత్రం ట్రంప్ ఎప్పటిలానే తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు అంటూ సమర్థిస్తున్నారు.
ఇక వైట్‌హౌస్ మాత్రం ఈ నిరసనలను ఖండించింది రిపబ్లికన్ వర్గాలు ఈ ర్యాలీలను హేట్ అమెరికా కార్యక్రమాలుగా పేర్కొన్నాయి. అయితే ట్రంప్ ఇటీవల జరిగిన సభలో మాట్లాడుతూ నేను రాజును కాదు, కానీ దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు.ఈ నిరసనల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పలు రాష్ట్ర గవర్నర్లు ముందస్తు చర్యగా జాతీయ బలగాలను మోహరించారు. చూడాలి మరి ఈ నిరసనలు ఎటువైపు కి దారితీస్తున్నాయో.