Lord Venkateswara Story: ప్రపంచంలో ఎన్నో ఆలయాలు.. మరెన్నో శక్తివంతమైన క్షేత్రాలు. కానీ, ఒక్కసారి ఆ నిలువెత్తు మాణిక్యాన్ని కళ్లారా చూస్తే చాలు, అక్కడే అలా నిలబడిపోవాలని ప్రతి భక్తుడికి అనిపిస్తుంది. ఆకర్షణ అన్నా, ఆనందం అన్నా అది కేవలం తిరుమల శ్రీవారికే సాధ్యం. అసలు 25 లక్షలకు పైగా గుడులున్న మన దేశంలో, కేవలం తిరుమలకు మాత్రమే ఎందుకంత క్రేజ్? దీని వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి?
పురాణాలు ఏం చెబుతున్నాయి?
మన 18 మహాపురాణాల్లో ఒకటైన స్కంద పురాణం ప్రకారం, కలియుగం అంతమయ్యే వరకు భక్తులను కాపాడటానికి శ్రీమహావిష్ణువు స్వయంగా ఈ వేంకటాచలంపై కొలువై ఉంటానని మాట ఇచ్చారు. అందుకే మన పెద్దలు అంటుంటారు, "ఏ గుడికి వెళ్లకపోయినా పర్వాలేదు కానీ, ఒక్కసారి ఆ ఏడుకొండల వాడిని దర్శించుకుంటే చాలు" అని. ఈ కొండలకు దాదాపు 200 కోట్ల ఏళ్ల చరిత్ర ఉందని శాస్త్రవేత్తలు సైతం చెబుతుండటం విశేషం.
వరాహ స్వామితో మొదలైన ప్రస్థానం
తిరుమల చరిత్ర నిజానికి వరాహ స్వామి అవతారంతో మొదలవుతుంది. హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని రక్షించిన వరాహ స్వామిని, తనతోనే ఉండమని భూదేవి కోరుతుంది. ఆమె కోరిక మేరకు వైకుంఠం నుండి ఆదిశేషుడు భూమిపైకి వచ్చి ఏడు కొండలుగా మారాడు. అందుకే ఈ ప్రాంతానికి శేషాచలం అని పేరు వచ్చింది.
తొలుత ఈ క్షేత్రాన్ని రక్షించడానికి 'నిషాదుడు' అనే వేటగాడిని స్వామివారు నియమించారు. ఎటువంటి మంత్రాలు తెలియకపోయినా, స్వచ్ఛమైన భక్తితో అతను చేసిన సేవలకు మెచ్చిన స్వామి, అతనికి క్షేత్ర రక్షకుడి హోదా ఇచ్చారు. కాలక్రమేణా ఆ విగ్రహం అడవిలో కలిసిపోయినప్పుడు, ఉత్తర భారత రాజు శంకన మహారాజు కలలోకి వచ్చి స్వామివారు తన ఉనికిని చాటుకున్నారు.
శ్రీనివాసుడి రాక.. అప్పుల కథ
వైకుంఠంలో భృగు మహర్షి చేసిన పని వల్ల లక్ష్మీదేవి భూమికి రావడం, ఆమెను వెతుకుతూ శ్రీహరి శ్రీనివాసుడిగా తిరుమల కొండపైకి చేరడం మనందరికీ తెలిసిన కథే. అయితే ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి:
హరినామం ఎలా పుట్టింది?: పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి ఒక ఆవు పాలు ఇస్తుంటే, అది చూసిన పశుల కాపరి కోపంతో విసిరిన కర్ర (లేదా గొడ్డలి) స్వామివారి నుదుటికి తగిలింది. ఆ గాయం నుండి రక్తం కారడం వల్లే మనకు 'హరినామం' ప్రాశస్త్యం వచ్చింది.
తలనీలాల వెనుక సాయం: దెబ్బ తగిలిన చోట జుట్టు కోల్పోయిన శ్రీనివాసుడికి, నీలాంబరి (నీలాదేవి) అనే భక్తురాలు తన జుట్టును ధారపోసింది. ఆమె త్యాగానికి గుర్తుగానే నేటికీ భక్తులు తిరుమలలో తలనీలాలు సమర్పిస్తారు.
వడ్డీ కాసుల వాడు: పద్మావతి అమ్మవారితో పెళ్లి కోసం శ్రీనివాసుడు కుబేరుడి వద్ద అప్పు తీసుకున్నాడు. ఆ అప్పుకు వడ్డీని భక్తులు ఇచ్చే కానుకల ద్వారా చెల్లిస్తానని మాట ఇచ్చాడు. అందుకే ఆయన్ని 'వడ్డీ కాసుల వాడు' అని పిలుచుకుంటాం.
నేటికీ సజీవ సాక్ష్యం
తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ఆనంద నిలయంలో స్వామివారు నేటికీ శిలా రూపంలో ఉన్నప్పటికీ, ఆయన ప్రాణం ఉన్న దైవంగానే భక్తులు నమ్ముతారు. శ్రీవారి ఎడమ రొమ్ముపై లక్ష్మీదేవి, కుడి వైపున పద్మావతి అమ్మవారు కొలువై ఉండటం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత.మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తిరుమలలో మనం చేసే దర్శనం కేవలం భౌతికమైంది మాత్రమే కాదు. మరో వైకుంఠం లో దేవతలు సైతం నిత్యం శ్రీవారిని సేవిస్తూనే ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే అక్కడ అడుగుపెట్టగానే ఒక తెలియని పాజిటివ్ వైబ్రేషన్ మనల్ని చుట్టేస్తుంది.