అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం పెన్సాకోలా నగరంలో ఒక హృదయాన్ని తాకే ఘటన జరిగింది. అక్కడి శ్రింప్ బాస్కెట్ అనే రెస్టారెంట్‌లో పదేళ్లుగా రోజుకు రెండు సార్లు భోజనం చేసే 78 ఏళ్ల వృద్ధుడు చార్లీ హిక్స్ అకస్మాత్తుగా రావడం మానేశాడు. ఈ మార్పును రెస్టారెంట్ చెఫ్ డొనెల్ స్టాల్‌వర్త్ గమనించాడు.
పదేళ్లుగా ఒకే సమయానికి వచ్చే కస్టమర్ కనిపించకపోవడంతో ఏదో సమస్య ఉందని చెఫ్‌కు అనుమానం వచ్చింది. మొదట ఫోన్ చేసి అడిగితే, తాను అనారోగ్యంగా ఉన్నానని హిక్స్ చెప్పాడు. వెంటనే అతని ఇష్టమైన భోజనాన్ని ఇంటి దగ్గరికి తీసుకెళ్లి తలుపు వద్ద పెట్టారు.
కానీ కొన్ని రోజులు గడిచినా ఫోన్‌కు స్పందన లేకపోవడంతో చెఫ్ ఆందోళన చెందాడు. మధ్యలో పని ఆపేసి నేరుగా హిక్స్ ఇంటికి వెళ్లాడు. తలుపు తట్టినప్పుడు లోపల నుంచి బలహీనమైన సహాయం కోరే స్వరం వినిపించింది. లోపలికి వెళ్లి చూడగా, హిక్స్ పడిపోయి రెండు ఎముకలు విరిగి, తీవ్ర నీరసం స్థితిలో ఉన్నాడు.
వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఉన్నంతకాలం రెస్టారెంట్ సిబ్బంది ప్రతిరోజూ అతని ఇష్టమైన భోజనాన్ని తీసుకెళ్లి ధైర్యం చెప్పారు. ఆసుపత్రి నుంచి విడుదలైన తర్వాత కూడా అతని ఆరోగ్యం చూసుకునేందుకు రెస్టారెంట్ పక్కనే ఉన్న ఇంటికి మారేందుకు సహాయం చేశారు.
డిసెంబర్ నాటికి హిక్స్ మళ్లీ తన అలవాటైన రెస్టారెంట్‌కు రావడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వారి మధ్య కేవలం కస్టమర్–షెఫ్ సంబంధం కాదు, కుటుంబ బంధంలా మారింది. ఒక సాధారణ ఆహార సంబంధం ఎలా ఒక ప్రాణాన్ని కాపాడిందో ఈ ఘటన అందరికీ ఆదర్శంగా నిలిచింది.