అమెరికాకు చెందిన ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ జేపీ మోర్గాన్ (JP Morgan) భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. ఆసియాలోనే అతిపెద్ద గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (GCC)ను భారత్‌లో ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ కేంద్రం పూర్తయ్యాక, గ్లోబల్ స్థాయిలో భారత్‌కు మరింత ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ కొత్త GCCను ముంబైలోని పౌవై ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఉండనుంది. ఈ స్థలాన్ని మొత్తం జేపీ మోర్గాన్ ఒక్కదే వినియోగించనుంది. 2029 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని సమాచారం. అప్పటికి ఇది ఆసియాలోనే అతిపెద్ద గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌గా నిలవనుంది.
ఈ కేంద్రంలో దాదాపు 30 వేల మంది ఉద్యోగులు పని చేసే అవకాశం ఉంది. టెక్నాలజీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్ వంటి విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయని తెలుస్తోంది. దీని వల్ల భారత యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అంచనా వేస్తున్నారు.
గత రెండు సంవత్సరాలుగా జేపీ మోర్గాన్ భారత్‌లో తన కార్యాలయ స్థలాన్ని వేగంగా పెంచుతోంది. ఇప్పటికే దాదాపు 10 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కంపెనీ తీసుకుంది. దీంతో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ (BFSI) రంగంలో భారత్‌లో అత్యంత చురుకుగా విస్తరిస్తున్న విదేశీ సంస్థలలో జేపీ మోర్గాన్ ఒకటిగా నిలిచింది.
ఈ నిర్ణయంతో భారత్ గ్లోబల్ GCC మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలు భారత్‌ను తమ ప్రధాన కార్యకలాప కేంద్రంగా ఎంచుకుంటుండటానికి ఇది మరో నిదర్శనం. ఉద్యోగాలు, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ కలిసి దేశ ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది.