ఈ మధ్యకాలంలో మారుతున్న జీవనశైలి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు డయాబెటీస్, ఊబకాయం, జీర్ణ సమస్యలు వంటి కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఈ కారణంగా చాలామంది తమ డైట్‌లో మార్పులు చేసుకుంటూ, రైస్‌ను తగ్గించి చపాతీని ఎక్కువగా తినడం మొదలుపెట్టారు. ముఖ్యంగా రాత్రి భోజనంలో చపాతీనే తీసుకుంటూ ఉంటున్నారు. అయితే ప్రతిరోజూ రాత్రి చపాతీ తినడం ఎంతవరకు మంచిదన్న సందేహం చాలా మందిలో ఉంది.
నిపుణుల మాటల్లో చెప్పాలంటే, సరైన పరిమాణంలో తీసుకుంటే చపాతీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు రాత్రి భోజనంలో రైస్ కంటే చపాతీ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. చపాతీల్లో ఉండే పీచు (ఫైబర్) రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా సహాయపడుతుంది. దీంతో షుగర్ నియంత్రణలో ఉండే అవకాశం ఉంటుంది. అయితే చపాతీతో పాటు తీసుకునే కూరలు, సైడ్స్ కూడా ఆరోగ్యకరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారికి కూడా చపాతీ మంచి ఆహారమే. రోజూ రెండు సాధారణ పరిమాణంలో ఉన్న చపాతీలను తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల అనవసరంగా మళ్లీ తినాలనే కోరిక తగ్గుతుంది. చపాతీలో ఉండే పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారు నిపుణుల సలహా మేరకు చపాతీని తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చని చెబుతున్నారు.
చపాతీని ఒక పోషకాల సమ్మేళనంగా నిపుణులు పేర్కొంటారు. ఇందులో బీ, ఈ విటమిన్లతో పాటు క్యాల్షియం, జింక్, కాపర్, అయోడిన్, మాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. చపాతీల్లో ఉండే ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. దీంతో రక్తహీనత వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే ఇందులోని సెలీనియం శరీరాన్ని కొన్ని క్యాన్సర్ కారకాల నుంచి రక్షించడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే చపాతీ ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువగా నెయ్యి, నూనె వాడి తయారుచేస్తే మాత్రం సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో అనవసర కొవ్వు చేరే అవకాశం ఉంటుంది. ముడిగోధుమలను స్వయంగా పట్టించి ఆ పిండితో చపాతీలు తయారుచేసుకోవడం ఉత్తమం. అలాగే గోధుమపిండిలో రాగి, సోయాబీన్, చిరుధాన్యాలు కలిపి చపాతీ చేసుకోవచ్చు. లేదా మంచి నాణ్యత గల మల్టీగ్రెయిన్ పిండిని వాడాలని సూచిస్తున్నారు. మొత్తంగా, పరిమితంగా మరియు సరైన విధంగా తీసుకుంటే రాత్రి చపాతీ తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.