- తక్కువ ధరలో 'మెటల్ బాడీ' ఎలక్ట్రిక్ స్కూటర్..
- బజాజ్ చేతక్ C25 వచ్చేసింది..
ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. పెట్రోల్ ధరల భారం తగ్గించుకోవాలని చూస్తున్న సామాన్యులకు బజాజ్ కంపెనీ ఒక తీపి కబురు అందించింది. పూణేలోని తమ ప్రధాన కార్యాలయంలో బజాజ్ వారు తమ కొత్త చేతక్ C25 (Chetak C25) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేశారు. ఇది బజాజ్ నుండి అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఈ స్కూటర్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు, దీని ఫీచర్లు ఎలా ఉన్నాయో ఈ వ్యాసంలో వివరంగా తెలుసుకుందాం.
ధర మరియు రంగులు..
బజాజ్ చేతక్ C25 ధర విషయానికి వస్తే, కంపెనీ దీనిని ₹91,399 (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేసింది. టీవీఎస్ (TVS) వంటి పోటీ కంపెనీలతో పోలిస్తే, దీని ధర చాలా తక్కువగా ఉండటం విశేషం. రంగుల విషయానికొస్తే, ఇది మొత్తం ఆరు రంగులలో లభిస్తుంది: వైట్, రెడ్, గ్రీన్, గ్రే, బ్లాక్ మరియు యల్లో. ముఖ్యంగా ఇందులో ఇచ్చిన పిస్తా గ్రీన్ రంగు చాలా ఆకర్షణీయంగా ఉంది.
డిజైన్ మరియు బాడీ క్వాలిటీ..
బజాజ్ తన పాత డిజైన్‌ను కొంత మార్చి, దీన్ని మరింత కాంపాక్ట్ (Compact) గా మరియు స్టైలిష్‌గా రూపొందించింది. ఈ స్కూటర్ యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని మెటల్ బాడీ. మార్కెట్లో చాలా స్కూటర్లు ప్లాస్టిక్ బాడీతో వస్తుంటే, బజాజ్ మాత్రం నాణ్యతలో రాజీ పడకుండా మెటల్ బాడీని కొనసాగించింది. వెనుక వైపు ఐస్ క్యూబ్స్ లాంటి కొత్త టేల్ లాంప్ డిజైన్ మరియు గోడల మీద ఉండే గ్రాఫిటీ నుండి ఇన్స్పైర్ అయిన కొత్త గ్రాఫిక్స్ స్కూటర్‌కు కొత్త లుక్ ఇచ్చాయి.
బ్యాటరీ మరియు రేంజ్…
ఈ స్కూటర్ పేరులో ఉన్న '25' అంటే దీనిలో 2.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుందని అర్థం. కంపెనీ లెక్కల ప్రకారం ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 113 కిలోమీటర్ల (IDC) రేంజ్ ఇస్తుంది. కానీ నిత్య జీవితంలో (Real Range), మనం ఈకో మోడ్‌లో నడిపితే సుమారు 95 నుండి 100 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంది. దీనిలోని 750W ఆఫ్-బోర్డ్ ఛార్జర్ సహాయంతో బ్యాటరీని 0 నుండి 80% వరకు కేవలం 2 గంటల 25 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు.
ఫీచర్లు మరియు డిస్ప్లే
స్కూటర్ ముందు భాగంలో రౌండ్ ఎల్ఈడి డిఆర్ఎల్ (LED DRL) మరియు ఎల్ఈడి హెడ్ లాంప్ ఉన్నాయి. పాత మోడల్స్‌లో సైడ్ ఇండికేటర్లు వేరుగా ఉండేవి, కానీ ఇందులో బాడీలోనే కలిపేశారు. డిస్ప్లే విషయానికి వస్తే, ఇందులో కొత్తగా రూపొందించిన ఎల్సీడీ (LCD) డిస్ప్లే ఉంది, ఇది:
• స్పీడ్
• మిగిలి ఉన్న రేంజ్
• బ్యాటరీ శాతం (పర్సంటేజ్ మరియు బార్స్ రూపంలో)
• ఓడోమీటర్ మరియు ట్రిప్ మీటర్ వంటి వివరాలను చూపిస్తుంది.
పర్ఫామెన్స్ మరియు మోటార్..
ధరను తగ్గించే క్రమంలో బజాజ్ కొన్ని మార్పులు చేసింది. ఇందులో BLDC హబ్ మోటార్‌ను వాడారు. ఇది గరిష్టంగా 60 kmph టాప్ స్పీడ్ వరకు వెళ్తుంది. ఇందులో ఈకో మరియు స్పోర్ట్స్ అని రెండు మోడ్‌లు ఉన్నాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు వెనుక డ్యూయల్ షాక్ అబ్సర్వర్లను ఇచ్చారు, ఇది ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేస్తుంది.
స్టోరేజ్ మరియు ఇతర సౌకర్యాలు..
సీటు కింద మనకి భారీగా 25 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది, ఇందులో సులభంగా ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ పెట్టుకోవచ్చు. అయితే, గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇందులో సెంటర్ స్టాండ్ మరియు లేడీస్ ఫుట్ రెస్ట్ కంపెనీ ఇవ్వడం లేదు, వీటిని మనం విడిగా (Accessories) కొనుక్కోవాల్సి ఉంటుంది.
ఇది ఎవరికి సెట్ అవుతుంది?
మీరు సిటీలో తక్కువ దూరాలు ప్రయాణించడానికి, మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్న ఒక బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తుంటే బజాజ్ చేతక్ C25 మంచి ఎంపిక అవుతుంది. టీవీఎస్ ఆర్బిటర్ వంటి వాటితో పోలిస్తే ధరలో ఇది దాదాపు ₹9,000 వరకు తక్కువగా లభిస్తుంది. యూత్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశామని కంపెనీ చెబుతున్నా, ఇది ఫ్యామిలీ అవసరాలకు కూడా బాగా సరిపోతుంది.