ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు న్యూ ఇయర్ సందర్భంగా శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ ప్రకటించింది. ఈ పంపిణీ కార్యక్రమం జనవరి 2 నుంచి 9 వరకు గ్రామాల్లో నిర్వహించనున్నారు. గ్రామసభల ద్వారా రైతులకు నేరుగా పాస్‌పుస్తకాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గత ప్రభుత్వం ఇచ్చిన భూహక్కు పత్రాల (BHP) స్థానంలో ఇప్పుడు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేస్తారు. వీటి ముద్రణ కోసం ప్రభుత్వం దాదాపు రూ.22.50 కోట్లు ఖర్చు చేసింది. గత 8 నెలలుగా వివిధ కారణాలతో వాయిదా పడిన ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఇక ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
జనవరి 2 నుంచి 9 వరకు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. ఈ గ్రామసభల్లో రైతుల వివరాలను వెబ్‌ల్యాండ్ డేటాతో సరిపోల్చి పరిశీలిస్తారు. అన్ని వివరాలు సరిగా ఉన్నాయని నిర్ధారించిన తర్వాతే కొత్త పాస్‌పుస్తకాలు అందజేస్తారు. లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకుని, ఈకేవైసీ ప్రక్రియను కూడా పూర్తిచేస్తారు.
అలాగే పాత భూహక్కు పత్రాలను రైతుల నుంచి తిరిగి తీసుకుంటారు. ఈ పంపిణీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం సూచించింది. కార్యక్రమం తేదీ, సమయాన్ని ముందుగానే ప్రజాప్రతినిధులకు, రైతులకు తెలియజేయాలని ఆదేశించింది. జిల్లాల వారీగా షెడ్యూల్‌ను డిసెంబరు 30లోపు ఉన్నతాధికారులకు పంపాలని రెవెన్యూ శాఖకు సూచించింది.
ముద్రించిన పాస్‌పుస్తకాలలో కొన్ని తీవ్రమైన తప్పులు బయటపడటంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. చనిపోయిన రైతుల పేర్లు, అక్షర దోషాలు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ తప్పులను అక్కడికక్కడే సరిదిద్దాలని తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. చనిపోయిన రైతుల స్థానంలో వారి వారసులకు పాస్‌పుస్తకాలు ఇవ్వాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.