ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి నిత్యం ఉపయోగించే మెసేజింగ్ యాప్ 'వాట్సాప్ తన వినియోగదారులకు చేదు వార్త చెప్పబోతోంది. ఇప్పటివరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా అందిస్తున్న సేవలను 'మానిటైజ్' చేసే దిశగా మెటా సంస్థ అడుగులు వేస్తోంది. తాజా బీటా అప్డేట్ ప్రకారం, ఇకపై వాట్సాప్‌లో ప్రకటనలు రాబోతున్నాయని, వాటిని నివారించాలంటే సబ్స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ప్రస్తుతం వాట్సాప్‌లో మనం చేసే చాటింగ్, వీడియో కాల్స్ వంటివి ఎప్పటిలాగే ఉచితంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, 'స్టేటస్' విభాగంలో మెటా మార్పులు చేయనుంది. యూట్యూబ్ తరహా విధానం మనం ఇతరుల స్టేటస్‌లను చూసే సమయంలో మధ్యలో వీడియో లేదా ఇమేజ్ రూపంలో ప్రకటనలు ప్రత్యక్షమవుతాయి.
ఒకవేళ మీకు ఈ ప్రకటనలు నచ్చకపోతే నో-యాడ్స్ సబ్స్క్రిప్షన్ కొంత మొత్తాన్ని చెల్లించి ప్రీమియం సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఎలాంటి అంతరాయం లేకుండా స్టేటస్‌లను వీక్షించవచ్చు. ప్రముఖ టెక్ వెబ్సైట్ 'ఆండ్రాయిడ్ అథారిటీ' నివేదిక ప్రకారం.. మెటా ఇప్పటికే ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అమలు చేస్తున్న 'పెయిడ్' మోడల్‌ను వాట్సాప్‌కు కూడా విస్తరిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ట్రయల్ వెర్షన్లో మాత్రమే కనిపిస్తున్నప్పటికీ, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2.8 బిలియన్ల వినియోగదారులకు ఇది అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా భారతదేశంలో 80 కోట్ల మందికి పైగా వాట్సాప్ యూజర్లు ఉండటంతో, ఇక్కడ ఈ నిర్ణయం పెద్ద ప్రభావం చూపనుంది.
ఏళ్ల తరబడి ఉచితంగా సేవలు అందిస్తున్న వాట్సాప్ నిర్వహణ ఖర్చులు పెరగడం, సర్వర్ల మెయింటెనెన్స్ వంటి కారణాల వల్ల ఆదాయాన్ని పెంచుకోవాలని మెటా భావిస్తోంది. ఇప్పటివరకు కేవలం వాట్సాప్ బిజినెస్ ద్వారా మాత్రమే ఆదాయాన్ని ఆర్జిస్తున్న కంపెనీ, ఇప్పుడు సాధారణ వినియోగదారుల నుంచి కూడా చందా వసూలు చేయాలని యోచనలో ఉంది