ఒకప్పుడు ఏదైనా విషయాన్ని తెలపాలంటే మైళ్ళ దూరం ఒక వ్యక్తి నడక సాగిస్తూ ఉండేవాడు.. ఆ కాలం పోయి పెన్ను పేపర్ తో ఉత్తరాల ద్వారా ప్రయాణం సాగిన కాలం కూడా వెళ్ళిపోయింది.. నేటి ఆధునిక యుగంలో ఒక విషయాన్ని తెలపాలంటే కొన్ని సెకండ్స్ లోనే ఆ విషయాన్ని మరొకరికి తెలిపేలా వేగవంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. సాఫ్ట్వేర్ రంగం నుంచి సామాన్య సేవారంగం వరకు ఏఐ వాడకం అనివార్యమైంది.
ఈ నేపథ్యంలో మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అభ్యర్థులను తీర్చిదిద్దేందుకు టెక్ దిగ్గజం గూగుల్ (Google) నడుం బిగించింది. భారతీయ విద్యార్థులు, నిరుద్యోగులు మరియు నిపుణుల కోసం ఏకంగా 3000కు పైగా ఏఐ మరియు క్లౌడ్ టెక్నాలజీ కోర్సులను ఉచితంగా ప్రకటించి సంచలనం సృష్టించింది. 2026లో జాబ్ మార్కెట్ ఆశించే నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రోగ్రామ్‌లను రూపొందించారు.
సర్టిఫికేషన్ నుంచి స్కిల్ బ్యాడ్జ్ వరకు.. గూగుల్ అందిస్తున్న ఈ కోర్సులు కేవలం వీడియో పాఠాలకే పరిమితం కావు. నేర్చుకోవాలని తపన ఉన్నది వ్యక్తి నైపుణ్యాన్ని బట్టి వీటిని మూడు స్థాయిలుగా విభజించారు:
బిగినర్ సర్టిఫికేట్స్: ఏఐ గురించి ప్రాథమిక అవగాహన లేని వారి కోసం.
స్కిల్ బ్యాడ్జ్ ప్రోగ్రామ్స్: నిర్దిష్ట సాంకేతికతలో పట్టు సాధించిన వారికి ఇచ్చే గుర్తింపు.
ప్రొఫెషనల్ క్లౌడ్ సర్ట్స్: నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉన్నత స్థాయి కోర్సులు.
అత్యంత విశేషమేమిటంటే, ఈ కోర్సులను గూగుల్ క్లౌడ్ నిపుణులు స్వయంగా రూపొందించారు. దీనివల్ల పరిశ్రమలో వీటికి అధిక విలువ ఉంటుంది.
టాప్ కంపెనీల గుర్తింపు:
చాలామంది ఆన్లైన్ కోర్సులు అంటే సర్టిఫికేట్ విలువపై అనుమానం వ్యక్తం చేస్తుంటారు. అయితే, గూగుల్ అందిస్తున్న ఈ సర్టిఫికేషన్లను యాక్సెంచర్ (Accenture), డెలాయిట్ (Deloitte) వంటి 150కి పైగా అగ్రశ్రేణి కంపెనీలు అధికారికంగా గుర్తిస్తున్నాయి. ఈ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులకు హైరింగ్ ప్రక్రియలో ప్రాధాన్యత లభిస్తుండటం విశేషం. కేవలం థియరీ మాత్రమే కాకుండా, రియల్ టైమ్ ప్రాజెక్టులపై పని చేసే అవకాశం కూడా ఈ ప్లాట్‌ఫారమ్ కల్పిస్తోంది.
ఉచిత క్లౌడ్ క్రెడిట్స్ మరియు ఇతర ప్రయోజనాలు:
కోర్సుల్లో చేరిన వారికి సులభతరం చేసేందుకు ప్రతి నెలా 35 ఉచిత క్లౌడ్ క్రెడిట్స్‌ను గూగుల్ అందిస్తోంది. వీటిని ఉపయోగించి గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌పై ప్రయోగాలు చేయవచ్చు. డేటా అనలిటిక్స్, ఆటోమేషన్, మరియు మెషిన్ లెర్నింగ్ రంగాల్లో స్థిరపడాలనుకునే వారికి ఇది ఒక 'గోల్డెన్ ఛాన్స్' అని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నిపుణుల విశ్లేషణ:
డిగ్రీల కంటే స్కిల్స్ ముఖ్యం...రాబోయే ఐదేళ్లలో కేవలం అకాడమిక్ డిగ్రీలు మాత్రమే ఉద్యోగాన్ని తెచ్చిపెట్టలేవు. ఏఐ టూల్స్‌ను వాడటం తెలిసిన వారికే ప్రాధాన్యత ఉంటుంది అని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. గూగుల్ ఉచితంగా అందిస్తున్న ఈ 'ఫస్ట్ క్లాస్ టికెట్'ను ఉపయోగించుకుని, భవిష్యత్ వర్క్‌ఫోర్స్‌లో భాగస్వాములు కావాలని వారు సూచిస్తున్నారు.
దరఖాస్తు విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు గూగుల్ యొక్క అఫీషియల్ లెర్నింగ్ పోర్టల్ లేదా 'గూగుల్ క్లౌడ్ స్కిల్స్ బూస్ట్' ప్లాట్‌ఫారమ్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేకుండా, మీ సౌలభ్యాన్ని బట్టి ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ కోర్సులను పూర్తి చేయవచ్చు.