ఇంటర్నెట్ వినియోగదారులందరికీ ఇది ఒక కీలక హెచ్చరిక. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తాజాగా గూగుల్ క్రోమ్ డెస్క్‌టాప్ వినియోగదారులకు హై రిస్క్ అలర్ట్ జారీ చేసింది. పాత వెర్షన్ల క్రోమ్ బ్రౌజర్లలో తీవ్రమైన భద్రతా లోపాలు గుర్తించబడ్డాయని, వీటి ద్వారా హ్యాకర్లు యూజర్ల వ్యక్తిగత డేటా, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు వంటి సమాచారం దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ లోపాలను సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉన్నందున, వినియోగదారులు వెంటనే తమ బ్రౌజర్‌లను అప్‌డేట్ చేయాలని CERT-In పిలుపునిచ్చింది.
ప్రస్తుతం విండోస్, మ్యాక్, లైనక్స్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లలో పాత క్రోమ్ వెర్షన్లు వాడుతున్న వారు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా 142.0.7444.59 కంటే పాత లైనక్స్ వెర్షన్లు, 142.0.7444.59/60 కంటే పాత విండోస్ వెర్షన్లు, అలాగే 142.0.7444.60 కంటే పాత మ్యాక్ వెర్షన్లు అత్యంత సున్నితమైనవిగా గుర్తించబడ్డాయి. వీటిని హ్యాకర్లు సులభంగా టార్గెట్ చేసే అవకాశం ఉందని హెచ్చరిక స్పష్టంచేసింది. కనుక వీటిని వాడుతున్న వారు తక్షణమే లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
అప్‌డేట్ చేయడం చాలా సులభమని టెక్ నిపుణులు చెబుతున్నారు. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి, కుడి పైన ఉన్న మూడు చుక్కల (More) మెనూపై క్లిక్ చేయాలి. తర్వాత Help → About Google Chrome ఎంపికను ఎంచుకోవాలి. ఈ పేజీ ఓపెన్ అవగానే క్రోమ్ ఆటోమేటిక్‌గా కొత్త అప్‌డేట్‌ల కోసం చెక్ చేస్తుంది. అప్‌డేట్ అందుబాటులో ఉంటే, డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత ‘Relaunch’ బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. దీంతో క్రోమ్ బ్రౌజర్ తాజా వెర్షన్‌కి అప్‌డేట్ అవుతుంది, సురక్షితంగా మారుతుంది.
సైబర్ దాడులు రోజురోజుకీ పెరుగుతున్న ఈ కాలంలో, యూజర్లు తమ బ్రౌజర్లు, యాప్‌లు, ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. పాత వెర్షన్లలో ఉండే సెక్యూరిటీ బగ్‌లను హ్యాకర్లు సులభంగా దోపిడీ చేయగలరని హెచ్చరిస్తున్నారు. కనుక సైబర్ సేఫ్టీ కోసం అప్‌డేట్‌లను నిర్లక్ష్యం చేయరాదని, ప్రతి ఇంటర్నెట్ వినియోగదారు ఈ అలర్ట్‌ను అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని సైబర్ భద్రతా అధికారులు సలహా ఇస్తున్నారు.