మంగళగిరిలో రేపటి నుంచి 2 రోజులపాటు మంగళగిరి ఫ్యాన్ పార్క్..
క్రికెట్ అభిమానులకు స్టేడియంలో ఉండి మ్యాచ్ తిలకించే అనుభూతి..
మంగళగిరి క్రికెట్ అభిమానులకు రేపటి నుంచి రెండు రోజులపాటు ప్రత్యేక ఉత్సాహాన్ని అందించేందుకు సిద్ధమైంది. బీసీసీఐ ఆధ్వర్యంలో మంగళగిరిలో “ఫ్యాన్ పార్క్” ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్యాన్ పార్క్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించడం విశేషం.
రేపు జరిగే మ్యాచ్‌లలో ఢిల్లీ–పంజాబ్, రాజస్థాన్–హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఎల్లుండి గుజరాత్–చెన్నై, లఖ్‌నవూ–కోల్‌కతా జట్ల మధ్య పోటీలు జరగనున్నాయి. ఈ నాలుగు మ్యాచ్‌లను పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రత్యక్షంగా ప్రసారం చేస్తూ, స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న అనుభూతిని అభిమానులకు అందించనున్నారు.
ఈ కార్యక్రమంతో పాటు మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా ఆకర్షణగా నిలుస్తోంది. ఈ లీగ్‌లో మొత్తం 120 జట్లు పాల్గొనడం విశేషంగా చెప్పుకోవచ్చు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ రెండు రోజుల ఫ్యాన్ పార్క్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఫ్యాన్ పార్క్ కార్యక్రమాలు స్టార్ స్పోర్ట్స్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. మంత్రి నారా లోకేశ్ చొరవతోనే ఈ కార్యక్రమం సాధ్యమైందని ఎంపీ సానా సతీష్ తెలిపారు.
మంగళగిరిని అన్ని రకాల క్రీడలకు వినూత్న కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. అలాగే, జూన్ 5 నుంచి మంగళగిరి స్టేడియంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఫ్యాన్ పార్క్ కార్యక్రమం మంగళగిరిలో క్రీడా ఉత్సాహాన్ని మరింత పెంచుతుందని, క్రికెట్ అభిమానులకు కొత్త అనుభూతిని అందిస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.