నోట్లో కరిగిపోయే హెల్దీ ఆనియన్ పరాటా రెసిపీ…
గోధుమపిండి, ఉల్లిపాయలతో నిమిషాల్లో తయారయ్యే టేస్టీ టిఫిన్…
పిల్లల లంచ్ బాక్స్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ…
తయారీ విధానం
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు కప్పుల గోధుమపిండి, కొంచెం ఉప్పు, ఒక స్పూన్ వాము మరియు కొంచెం నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా పైన కొంచెం నూనె రాసి, మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి.
ఇప్పుడు ఉల్లిపాయ స్టఫ్ తయారీ కోసం, మూడు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా, పొడవుగా కట్ చేసి తీసుకోవాలి. అందులో కారం, చాట్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా మరియు చివరగా తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ముఖ్యంగా ఉల్లిపాయల్లోని తేమను పీల్చుకోవడానికి ఒకటిన్నర టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసి బాగా కలపాలి, దీనివల్ల స్టఫ్ పొడిపొడిగా ఉంటుంది.
నానిన గోధుమపిండిని తీసుకుని పెద్ద ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను పొడి పిండి చల్లుకుంటూ పెద్ద చపాతీలాగా రుద్దుకోవాలి. దానిపై మనం సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని ఎక్కడా ఖాళీ లేకుండా సమానంగా పరవాలి.
తర్వాత చపాతీని ఒక వైపు నుండి మెల్లగా రోల్ లాగా చుట్టుకుని, దాన్ని మధ్యలోకి రెండు భాగాలుగా కట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకు రెండు పరాటాలు వస్తాయి. కట్ చేసిన భాగాన్ని రౌండ్‌గా చుట్టి, మళ్ళీ పొడి పిండి చల్లుకుంటూ పరాటాలా మెల్లగా రుద్దుకోవాలి.
చివరగా స్టవ్ మీద పెనం పెట్టి వేడయ్యాక, పరాటాను వేసి మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. పైన కొంచెం నూనె లేదా నెయ్యి అప్లై చేస్తూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే ఎంతో క్రిస్పీగా, రుచిగా ఉండే ఆనియన్ పరాటా సిద్ధమవుతుంది.