కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరింత భద్రత కల్పించే దిశగా కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) లబ్ధిదారుల కోసం ‘పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా’ అనే కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని బుధవారం అధికారికంగా ప్రారంభించింది. ఈ బీమా పథకం టాప్-అప్ స్కీమ్ రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. అంటే ఇప్పటికే సీజీహెచ్‌ఎస్ కవరేజీ ఉన్నవారు అదనపు రక్షణగా ఈ పాలసీని కొనుగోలు చేసుకోవచ్చు. లబ్ధిదారులు తమ అవసరాలను బట్టి ఈ బీమాను స్వచ్ఛందంగా తీసుకునే అవకాశం ఉంది.
ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఏ ఆస్పత్రిలో అయినా ఇన్‌పేషెంట్ చికిత్సలకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బీమా కవరేజీ లభిస్తుంది. పెద్ద చికిత్స ఖర్చుల వల్ల ఆర్థిక భారం పడకుండా ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ బీమాలో కో-పేమెంట్ విధానం కూడా ఉంది. అంటే ప్రీమియం మొత్తాన్ని బీమా కంపెనీతో పాటు లబ్ధిదారుడు కూడా భాగస్వామిగా చెల్లించవచ్చు. 70:30 వాటా విధానంలో పాలసీ తీసుకుంటే ప్రీమియంపై 28 శాతం రాయితీ లభిస్తుంది. 50:50 వాటా విధానంలో కొనుగోలు చేస్తే 42 శాతం రాయితీ అందుతుంది.
ఇంకా ఈ పాలసీకి మరో ఆకర్షణీయమైన లాభం ఉంది. ఒక ఏడాది పాటు ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే బీమా మొత్తంపై 10 శాతం బోనస్ రూపంలో అదనపు ప్రయోజనం లభిస్తుంది. ఆస్పత్రిలో చేరే ముందు 30 రోజుల ప్రీ-హాస్పిటలైజేషన్ ఖర్చులు, అలాగే డిశ్చార్జ్ అయిన తర్వాత 60 రోజుల పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులు కూడా ఈ బీమా కవరేజీలోకి వస్తాయి. ఇది రోగులకు పూర్తి స్థాయి ఆర్థిక రక్షణను అందిస్తుంది.
సీజీహెచ్‌ఎస్ లబ్ధిదారులు ఈ ‘పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా’ పాలసీని న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పథకం కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంతో ప్రయోజనకరంగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.