- అంగన్ వాడీలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం..
- క్లిష్ట పరిస్థితుల్లోనూ ఉద్యోగులకు బాసటగా కూటమి ప్రభుత్వం..
Minister NMD Farooq: రాష్ట్ర ఆర్థిక రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా దివాలా తీయించి, బ్రష్టు పట్టించిందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ధ్వజమెత్తారు. ఐదేళ్ల గత ప్రభుత్వ హయాంలో వారు చేసిన అప్పులకు, ప్రస్తుతం వస్తున్న రాష్ట్ర ఆదాయంతో పాటు అదనంగా అప్పులు తెచ్చి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్నదని ఆదివారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటన లో మంత్రి ఫరూక్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అంగన్ వాడీలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు.అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండు సార్లు అంగన్ వాడీల వేతనాలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్ వాడీ కేంద్రాల మౌళిక సదుపాయాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.86.68 లక్షలు విడుదల చేసి, ఒక్కో కేంద్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.
ఆలస్యంగా జీతాల చెల్లింపుకు శాశ్వత చెక్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్ వాడీలకు ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు అందేలా చర్యలు తీసుకుని, జీతాల ఆలస్యానికి శాశ్వతంగా చెక్ పెట్టిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి ఫరూక్ అన్నారు. క్షేత్ర స్థాయిలో సులభతరంగా, సాంకేతికతను అందిపుచ్చుకొని సేవలందించేందుకు వీలుగా 58,204 మంది అంగన్ వాడీ వర్కర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు రూ.75 కోట్ల వ్యయంతో 5జి స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం పంపిణీ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా, సమర్థవంతంగా సేవలు అందించడానికి 5జి సేవలతో సిబ్బంది విస్తృత సేవలు అందిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా అంగన్ వాడీ కేంద్రాల హాజరు 70 శాతం నుంచి 96 శాతానికి పెరగడం ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు చేస్తున్న కృషికి నిదర్శనంగా పేర్కొనవచ్చని అన్నారు.గ్రాట్యుటీ చెల్లింపుల కోసం 2025 బడ్జెట్ లోనే రూ.20 కోట్లు కేటాయించి, అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అంగన్ వాడీలకు అండగావేతనాల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి
నిలిచిన ఘనత సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
అంగన్ వాడీలలో సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కార్యాచరణ బద్ధంగా అన్ని చర్యలను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మినీ అంగన్ వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి అంగన్ వాడీ కేంద్రాలుగా ఉన్నతీకరించిందని అన్నారు. దీంతో మినీ అంగన్ వాడీ కార్యకర్తలకు టీచర్లుగా పదోన్నతి కల్పించి, పూర్తి స్థాయి వేతనాల చెల్లింపులతోపాటు, కొత్తగా 5,000 మంది అంగన్ వాడీ సహాయకులను ప్రభుత్వం నియమించనున్నదని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు.అంగన్ వాడీలు ప్రతిపాదించిన డిమాండ్లలో 9 డిమాండ్లను ఇప్పటికే కూటమి ప్రభుత్వం పరిష్కరించిందన్నారు.వేతనాల పెంపు అంశాన్ని కూడా వీలైనంత వరకు అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వెల్లడించారు.
ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
గత ప్రభుత్వ విధ్వంసపాలన కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం, తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తూ, ఉద్యోగులకు భరోసాగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం గా ప్రజలందరి మన్ననలు పొందుతున్నదని అన్నారు.గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక రంగాన్ని దివాళ తీసి వెళ్లిందన్నారు. చేసిన తప్పులను, పాపాలను కప్పిపుచ్చుకునేందుకు గత ప్రభుత్వ పాలకులందరూ కూటమి ప్రభుత్వాన్ని, కూటమి నాయకులను టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తుండడం చూసి రాష్ట్ర ప్రజలందరూ అసహ్యించుకుంటున్నారని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు.