రూ.8.25 కోట్ల వ్యయంతో 14 అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపనలు..
వైసీపీ పాలనలో స్థానిక నాయకులు పదవులు అనుభవించారే గానీ అభివృద్ధిని పట్టించుకోలేదు..
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయని అన్నారు.
శనివారం పాలకొల్లు మండలంలోని పలు గ్రామాల్లో రూ.8.25 కోట్ల వ్యయంతో 14 అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కూటమి నాయకులతో కలిసి ఆయన పలు గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో మంత్రి రాక సందర్భంగా స్థానికులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. మహిళలు పూల వర్షం కురిపించి అభినందనలు తెలిపారు.
పూలపల్లి గ్రామంలో రూ.3.70 కోట్లతో పూలపల్లి – ఆగర్తిపాలెం ఆర్ అండ్ బి రహదారి అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆగర్రు గ్రామంలో రూ.37.70 లక్షలతో పాత నెం.3 కాలువ గట్టుపై గ్రావెల్ రోడ్డు నిర్మాణం, రూ.30 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి, రూ.25 లక్షలతో కొత్త కమ్యూనిటీ హాల్ నిర్మాణం, రూ.9 లక్షలతో రెవెన్యూ బోధిపై గ్రావెల్ రోడ్డు పనులను ప్రారంభించారు.
అదే గ్రామంలో రూ.37.60 లక్షలతో జున్నూరు కాలువకు సీసీ వాల్ నిర్మాణం, రూ.49.20 లక్షలతో ఆగర్రు నుంచి చిటివానిగరువు వరకు సీసీ వాల్ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపనలు చేశారు.
వెలివెల గ్రామంలో రూ.73.70 లక్షలతో జున్నూరు కాలువపై ఎస్‌ఎల్‌ఆర్ వంతెన నిర్మాణం, రూ.23.50 లక్షలతో సీసీ వాల్ నిర్మాణం, రూ.21 లక్షలతో కాలువ గట్టు పై గ్రావెల్ రోడ్డు పనులను ప్రారంభించారు.
ఆగర్తిపాలెం గ్రామంలో రూ.15.50 లక్షలతో అంగన్‌వాడీ భవనం నిర్మాణం, రూ.92 లక్షలతో త్రాగునీటి పథకాన్ని మంత్రి ప్రారంభించారు. సగంచెరువు గ్రామంలో రూ.8.01 లక్షలతో గోరింటాడ చిన్న కాలువ గట్టుపై గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గోరింటాడ గ్రామంలో రూ.32.40 లక్షలతో పీనుగులకోడు చిన్న కాలువ, రెవెన్యూ కాలువ గట్టుపై గ్రావెల్ రోడ్డు పనులను ప్రారంభించారు.
అనంతరం గోరింటాడలో జరిగిన బహిరంగ సభలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, “పాలకొల్లు నియోజకవర్గ ప్రజలంతా నా కుటుంబ సభ్యులే. వారి అభివృద్ధి కోసం ఎంతైనా కష్టపడతాను” అని అన్నారు.
గత వైసీపీ పాలనలో స్థానిక నాయకులు పదవులు అనుభవించారే గానీ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. డీసీసీబీ, డీసీఎంఎస్, టీటీడీ బోర్డు సభ్యత్వాలు, జడ్పీ చైర్మన్ పదవులు ఉన్నప్పటికీ ప్రజలకు ఉపయోగపడే పనులు జరగలేదన్నారు.
రైతు బిడ్డగా రైతుల సమస్యలు తనకు తెలుసని మంత్రి చెప్పారు. అందుకే పంట కాలువలు, మురుగు డ్రైన్ల వెంట గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు తీసుకొస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులను కూడా వినియోగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందించే కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే అభివృద్ధి, సంక్షేమం మరో 15 సంవత్సరాలు కొనసాగుతాయని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.