డీజిల్, పెట్రోల్‌పై ఆ పార్టీ పుకార్లతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది..
ఆర్సెలర్ మిట్టల్, రిలయన్స్ వంటి సంస్థలు పెట్టుబడులు, గూగుల్ త్వరలో ప్రారంభం..
విజయవాడ: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరతపై వస్తున్న వార్తలు పూర్తిగా పుకార్లేనని సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి స్పష్టం చేశారు. కొందరు ప్రతిపక్ష నాయకులు నెగటివ్ ప్రచారం ద్వారా ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు.
కృష్ణా జిల్లా పామర్రు మండలం కారకంపాడు గ్రామంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షం లేకపోవడం వల్లే ఇటువంటి అపోహలు వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు. ప్రభుత్వం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుంటే, కొందరు దానిని దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని, ఆర్సెలర్ మిట్టల్, రిలయన్స్ వంటి పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టుతున్నాయని మంత్రి తెలిపారు. గూగుల్ సంస్థ కూడా త్వరలో కార్యకలాపాలు ప్రారంభించబోతుందని చెప్పారు. ఇప్పటికే రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని వివరించారు.
డీజిల్ కొరతపై వస్తున్న వార్తల గురించి మాట్లాడుతూ… కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటోందన్నారు. పానిక్ పర్చేస్‌ల కారణంగా కొంత ఒత్తిడి ఏర్పడిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేస్తూ సరఫరాను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రైతులు, ఆక్వా రంగానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం స్టాక్ అవుట్ బంకుల సంఖ్య తగ్గుతోందని, పరిస్థితి త్వరలో పూర్తిగా సాధారణమవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.
రైతు సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు. ధాన్యం చెల్లింపులు 24 నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని వెల్లడించారు. మొక్కజొన్న రైతుల సమస్యను కేంద్రానికి తెలియజేశామని, స్పందన వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ధరల స్థిరీకరణ నిధి కింద రూ.800 కోట్లు ఖర్చు చేసి రైతులకు అండగా నిలిచినట్లు తెలిపారు. పొగాకు, కోకో, మామిడి పంటలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా మద్దతు ధర అందిస్తున్నామని వివరించారు.
నీటిపారుదల రంగంలో కూడా మెరుగుదలకు చర్యలు తీసుకుంటున్నామని, డ్రైనేజీ, ఇరిగేషన్ వ్యవస్థలను బలోపేతం చేయడానికి O&M నిధులు కేటాయించి టెండర్ల ద్వారా పనులు చేపడుతున్నామని చెప్పారు.
పెట్రోల్ బంకుల్లో కొరత ఉందన్న వార్తలను ఖండిస్తూ, ఎక్కడా నిల్వల కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. ధరలు అంతర్జాతీయ మార్కెట్ మరియు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటాయని వివరించారు.
ఇటీవల చిత్తూరు జిల్లా వి.కోటలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమని, వారిపై దాడులు చేయడం అనాగరిక చర్య అని పేర్కొంటూ బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు.
చివరిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ… పెట్రోల్, డీజిల్ విషయంలో పుకార్లను నమ్మకుండా, పానిక్ పర్చేస్‌లకు పాల్పడవద్దని మంత్రి కోరారు. ప్రభుత్వం సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.