మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌పై టీడీపీ చారిత్రాత్మక నిర్ణయం..
మహిళా సాధికారతకు లోకేష్ భారీ ముందడుగు..
అమరావతి: మహిళల రాజకీయ సాధికారతకు తెలుగుదేశం పార్టీ మరో కీలక అడుగు వేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మహానాడులో మంత్రి నారా లోకేష్ మహిళలకు పార్టీ పదవులు, అవకాశాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం మహిళల్లో కొత్త ఆశలు నింపిందన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… మహిళల అభివృద్ధి గురించి చాలామంది నాయకులు మాట్లాడతారని, కానీ ఆచరణలో ఇలాంటి ధైర్యమైన నిర్ణయం తీసుకునే నాయకత్వం చాలా అరుదుగా కనిపిస్తుందని అన్నారు. మహిళలకు సమాన రాజకీయ అవకాశాలు కల్పించాలనే నిజమైన సంకల్పం మంత్రి లోకేష్‌లో ఉందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ఎదుర్కొన్న అడ్డంకులను ప్రస్తావిస్తూ… బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా తెలుగుదేశం పార్టీలో మాత్రం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని లోకేష్ ప్రకటించడం గొప్ప విషయం అని కొనియాడారు.
మహిళల పట్ల గౌరవం, వారికి రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించాలనే ఆలోచన ఈ నిర్ణయంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. నాయకుడు అంటే కేవలం పదవిలో ఉండటం కాదని… సమాజానికి దిశా నిర్దేశం చేసే వ్యక్తి కావాలని, ఆ లక్షణాలు మంత్రి లోకేష్‌లో కనిపిస్తున్నాయని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
మహిళల భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. యువ నాయకత్వం అంటే ఏమిటో, మహిళల పట్ల నిబద్ధత ఎలా ఉండాలో దేశానికి ఆదర్శంగా నిలిచేలా మంత్రి లోకేష్ ముందుకు సాగుతున్నారని అన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉందని గుర్తు చేసిన మంత్రి ఇప్పుడు లోకేష్ నాయకత్వంలో ఆ సంకల్పం మరింత బలపడిందన్నారు. భవిష్యత్తులో మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా ఇది ఒక గొప్ప ముందడుగు అవుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.