అక్రమ చొరబాట్ల ప్రభావంపై కేంద్రం కీలక నిర్ణయం..
దేశవ్యాప్తంగా జనాభా మార్పులపై సమగ్ర పరిశీలనకు కేంద్రం సిద్ధం..
దేశంలో అక్రమ చొరబాట్లు, ఇతర అసహజ కారణాల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్ ప్రభాకర్ నయోలేకర్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఈ కమిటీలో జనగణన కమిషనర్‌తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి దుర్గాశంకర్ మిశ్రా, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ శమికా రవి సభ్యులుగా ఉన్నారు. హోం మంత్రిత్వ శాఖలోని ఫారినర్స్-1 విభాగం జాయింట్ సెక్రటరీ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.
గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ జనాభా మార్పులపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటనకు అనుగుణంగానే ఇప్పుడు కేంద్రం ఈ కీలక కమిటీని ఏర్పాటు చేసింది.
అక్రమ చొరబాట్లు మరియు ఇతర కారణాల వల్ల దేశంలో అసహజ జనాభా మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఇవి దేశ భవిష్యత్తుకు పెద్ద సవాలుగా మారుతున్నాయని అమిత్ షా పేర్కొన్నారు. ఈ మార్పులు కేవలం జనాభా గణాంకాలకు మాత్రమే పరిమితం కావని, దేశ సార్వభౌమత్వం, జాతీయ భద్రత, చట్టవ్యవస్థ, సామాజిక నిర్మాణం, గిరిజన సమాజ పరిరక్షణ వంటి అంశాలపై కూడా ప్రభావం చూపుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కమిటీ దేశవ్యాప్తంగా జరుగుతున్న అసహజ జనాభా మార్పులను సమగ్రంగా పరిశీలించనుంది. ముఖ్యంగా అక్రమ వలసల ప్రభావం, మత మరియు సామాజిక వర్గాల వారీగా జనాభా మార్పుల ధోరణులను విశ్లేషించనుంది. అంతేకాకుండా, ఈ సమస్యకు సమయపాలనతో కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. దేశ భద్రత, సామాజిక సమతుల్యత దృష్ట్యా ఈ కమిటీ కీలక నిర్ణయాలకు దారి తీసే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.