దేశ రక్షణ బోట్ల తయారీ కంపెనీపై జగన్ అడ్డంకులు…
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న జగన్ రెడ్డి…
జగన్ దుర్మార్గపు ఆలోచనలను ఎండగట్టిన లోకేష్…
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ రాజకీయ శైలిని విమర్శిస్తూ, సొంత తల్లిని, చెల్లిని కూడా గౌరవించని వ్యక్తికి రాష్ట్రంపై ప్రేముంటుందని ఆశించలేమని లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డికి దైవం అంటే భక్తి లేదని, దేశం అంటే ద్వేషమని విమర్శిస్తూ.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారని ఆరోపించారు. ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా కాకుండా, ప్రతికూల ఆలోచనలతో ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా రాష్ట్రానికి వస్తున్న కొత్త పరిశ్రమలను జగన్ వర్గం అడ్డుకోవాలని చూడటంపై లోకేష్ మండిపడ్డారు. దేశ రక్షణకు అవసరమైన అధునాతన బోట్లను తయారు చేసే ఒక భారీ కంపెనీ రాష్ట్రానికి వస్తుంటే, దాన్ని స్వాగతించాల్సింది పోయి "తరిమేస్తాం" అని వ్యాఖ్యానించడం జగన్ రాక్షస మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. ఈ కంపెనీ ద్వారా స్థానిక మత్స్యకారుల పిల్లలకు సుమారు వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, యువతకు ఉపాధి దొరుకుతుందంటే జగన్ రెడ్డి ఎందుకు అంతలా ఏడుస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర పురోభివృద్ధిని అడ్డుకోవడం సైకోయిజం తప్ప మరొకటి కాదని లోకేష్ అభివర్ణించారు.
అమరావతి రాజధాని విషయంలో జగన్ అనుసరిస్తున్న తీరును కూడా లోకేష్ తీవ్రంగా ఖండించారు. "అమరావతిని మార్చేస్తాం.. కట్టినవన్నీ కూల్చేస్తాం.. రప్పా రప్పా నరుకుతాం" అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ఇవన్నీ ఎంత దుర్మార్గమైన పనులో ప్రజలు ఆలోచించాలని కోరారు. అభివృద్ధిని నిర్మించడం చేతకాని వారు, ఉన్న వాటిని కూలదోస్తామనడం వారి వినాశకర ఆలోచనలకు నిదర్శనమని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో రైతులు చేసిన త్యాగాలను అవహేళన చేస్తూ, రాష్ట్రాన్ని చీకటిలోకి నెట్టేయాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని లోకేష్ ధ్వజమెత్తారు.
యువతకు ఉద్యోగాలు రావడం జగన్‌కు ఏమాత్రం ఇష్టం లేదని లోకేష్ ఆరోపించారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందని, కానీ జగన్ రెడ్డి మాత్రం ఉద్యోగాలు వస్తుంటే ఉసూరుమంటూ ఏడుస్తారని ఎద్దేవా చేశారు. ప్రజలకు మేలు జరిగే ఏ పనినైనా అడ్డుకోవడం ఆయనకు అలవాటుగా మారిందని, ఇది కేవలం రాజకీయ స్వార్థం కోసమేనని స్పష్టం చేశారు. మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపే ప్రాజెక్టును రాజకీయ కారణాలతో పాడుచేయాలని చూడటం శోచనీయమని అన్నారు.