- శతాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయండి..
- ప్రపంచంలోనే సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ గా ఏయూని తీర్చిదిద్దుతాం…
Lokesh order in review of AU centenary: ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఆంధ్ర యూనివర్సిటీకి పూర్వవైభవం తీసుకువస్తామని, శతాబ్ది ఉత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో విశాఖలో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆంధ్ర యూనివర్సిటీకి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. యూనివర్సిటీని ప్రపంచంలోనే సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ గా తీర్చిదిద్దేందుకు శతాబ్ది ఉత్సవాలు వేదిక కావాలి.
మార్చి 26 నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు పూర్వ విద్యార్థులతో మమేకం కావడంతో పాటు శతాబ్ది ఉత్సవాల్లో వారిని భాగస్వాములను చేయాలి. శతాబ్ది ఉత్సవాల్లో ఆంధ్ర యూనివర్సిటీ ఘన చరిత్ర ప్రతిబింబించాలి. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. కమిటీలను సమన్వయం చేసుకోవాలి. మీడియా పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుత విద్యార్థులతో కళలు, సంగీతం, సాహిత్యం వంటి కార్యక్రమాలను రూపొందించాలి. వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉత్తరాంధ్ర ప్రజలు, విద్యార్థులను భాగస్వాములను చేయాలి. ప్రముఖలతో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించాలి. యూనివర్సిటీ వందేళ్ల విజన్ కు అవసరమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి ఆదేశించారు.
శతాబ్ది ఉత్సవాల సందర్భంగా యూనివర్సిటీలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులతో పాటు ఏప్రిల్ 26వ తేదీన శతాబ్ది స్థాపన దినోత్సవ అజెండాను వీసీ వివరించారు. అనుబంధ కళాశాలలను ఉత్సవాల్లో భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు పలు సూచనలు చేశారు. యూనివర్సిటీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ శతాబ్ది ఉత్సవాల్లో భాగస్వామ్యం చేయాలని సూచించారు. విజిబిలిటీని క్రియేట్ చేయాలి. శతాబ్ది ఉత్సవాల నిర్వహణ అద్భుత అవకాశం. సద్వినియోగం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, పీజీవీఆర్ నాయుడు, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.