కానిస్టేబుల్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ..
తక్షణ సాయంగా ఎక్సైజ్ శాఖ నుండి రూ.10 లక్షలు..
అమరావతి: విశాఖ జిల్లాలో జరిగిన విషాదకర ఘటనపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతమ్మధార ఎక్సైజ్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ ఎల్.ఎస్. నాయుడు విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆయనను కలచివేసింది.
ఈ ఘటనపై స్పందించిన మంత్రి, మృతుని కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బాధిత కుటుంబం ధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వం సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
తక్షణ సాయంగా ఎక్సైజ్ శాఖ నుంచి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అదనంగా ఎస్బీఐ ఇన్సూరెన్స్ ద్వారా రూ.1.10 కోట్ల జీవన బీమా సదుపాయం కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే, మృతుని కుటుంబంలో అర్హులైన వ్యక్తికి కారుణ్య నియామకం కల్పించి వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని మంత్రి తెలిపారు. ఈ ఘటనపై సానుభూతి వ్యక్తం చేసిన ఆయన, ప్రభుత్వ తరఫున బాధిత కుటుంబానికి అన్ని విధాల సహకారం అందుతుందని మరోసారి స్పష్టం చేశారు.