విజయవాడలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు కేసు విచారణ బదిలీ..
రెండు పిటిషన్లను కొట్టివేస్తూ కాకాణి గోవర్ధన్ రెడ్డికి షాకిచ్చిన కోర్టు..
నకిలీ డాక్యుమెంట్ల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు విచారణను విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ కేసులో మొదట తన పేరును తొలగించాలని కోరుతూ కాకాణి గోవర్ధన్ రెడ్డి డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించలేదు. అనంతరం కేసు విచారణను నెల్లూరు కోర్టులోనే కొనసాగించాలని కోరుతూ మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
ఈ రెండు పిటిషన్లను కోర్టు కొట్టివేయడంతో కాకాణికి షాక్ తగిలినట్లైంది. దీంతో కేసు విచారణ ఇప్పుడు విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో కొనసాగనుంది.
గతంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుటుంబానికి విదేశాల్లో వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయంటూ కాకాణి వీడియో ప్రదర్శన చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆ ఆరోపణలకు సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు ఉపయోగించారనే అభియోగాలతో ఈ కేసు నమోదైంది.
ఇప్పుడు కోర్టు తాజా నిర్ణయంతో ఈ కేసు మళ్లీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసు విచారణలో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.