ప్రధాని మోదీ సూచనలను ఫాలో అవుతున్న యావత్ దేశం..
ఇంధన పొదుపుకే ప్రాధాన్యం అంటున్న కేంద్ర ప్రభుత్వం..
దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించి, అనవసర ఖర్చులను నియంత్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సూచనలతో కేంద్ర మంత్రులు, ప్రభుత్వ విభాగాలు, బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొత్త విధానాలను అమలు చేయడం ప్రారంభించాయి. క్లిష్ట పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా పొదుపు చర్యలకు ప్రాధాన్యం పెరుగుతోంది.
ఇటీవల ప్రధాని మోదీ రెండు ఎస్‍యూవీలకు కాన్వాయ్ తగ్గించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తన కాన్వాయ్‌ను నాలుగు వాహనాలకు మాత్రమే కుదించారు. అధికార యంత్రాంగం నుంచి ప్రజలకు కూడా ఇంధన పొదుపుపై సందేశం వెళ్లాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది.
ప్రధాని ఇటీవల చేపట్టిన పర్యటనల్లో కూడా వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. మంత్రులు, ఉన్నతాధికారులు అవసరమైనప్పుడే వాహనాలు వినియోగించాలని, ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం. దీనితో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ కాన్వాయ్‌లను తగ్గించుకోవడం ప్రారంభించారు.
అంతేకాకుండా మంత్రులు, ప్రజాప్రతినిధుల విదేశీ పర్యటనలపై కూడా కేంద్రం నియంత్రణలు విధిస్తోంది. ప్రభుత్వ విమానాలను వినియోగించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి చేసినట్లు తెలుస్తోంది. అనవసర ప్రయాణాలను తగ్గించాలనే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు.
గుజరాత్ గవర్నర్ ప్రజా రవాణా సేవలను వినియోగిస్తానని ప్రకటించడం కూడా ప్రస్తుతం చర్చకు దారితీసింది. మరోవైపు పలు కేంద్ర మంత్రిత్వ శాఖలు ఇంధన పొదుపు చర్యలతో పాటు అనవసర ఖర్చులను తగ్గించే దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులు మెట్రో రైలు సేవలను వినియోగించేలా ప్రోత్సహిస్తున్నారు. కార్ పూలింగ్ విధానానికి కూడా ఉన్నతాధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా ఇంధన వినియోగం కూడా నియంత్రణలో ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రధాని పిలుపుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ మీటింగ్స్, వర్చువల్ కాన్ఫరెన్సింగ్ వంటి విధానాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ ఫోరం కూడా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సహించాలని అభిప్రాయపడింది.
దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ పొదుపు చర్యలు భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశం ఉందని రాజకీయ, పరిపాలనా వర్గాలు భావిస్తున్నాయి.