- పాఠశాల విద్యకు దూరం కాకూడదనే విద్యార్థులకు సైకిళ్లు…
- మార్చి నెలాఖరుకు మరో 3 వేల సైకిళ్లను విద్యార్థులకు అందజేస్తాం…
Gottipati Ravikumar: అద్దంకి నియోజవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8 వేల మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ పూర్తి చేసినట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. దూరాభారం, వ్యయప్రయాసల వలన ఎవరూ పాఠశాల చదువులకు దూరం కాకూడదనే అద్దంకి నియోజకవర్గ పరిధిలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులందరికీ సైకిళ్లను ఉచితంగా అందిస్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. సంతమాగులూరు మండలంలోని ఏల్చూరులో శనివారం నాడు మంత్రి గొట్టిపాటి పర్యటించారు. ఏల్చూరు ఉన్నత పాఠశాలలో 454 మంది విద్యార్థులకు ఆయన సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ., దాతల సహాయంతో ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
తాను ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో కొందరు 8, 9 తరగతుల విద్యార్థులు రెండు, మూడు కిలోమీటర్ల దూరం నుంచి స్కూళ్లకు నడిచి రావడం గమనించానన్నారు. ముందుగా 8, 9 తరగతులు వారికి మాత్రమే సైకిళ్లు అందించాలని అనుకున్నా, ఆ తరువాత కొందరు చిన్నారులు అడగటంతో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. పాఠశాల విద్యార్థులతో పాటు కొందరు ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ చదివే పేద విద్యార్థులకు కూడా దాతల సహాయంతో సైకిళ్లను పంపిణీ చేశామని చెప్పారు. అద్దంకి నియోజకవర్గంలో మరో 3 వేలు సైకిళ్లు ఉన్నత పాఠశాల విద్యార్థులకు అందించాల్సి ఉందని తెలిపారు. వాటిని కూడా మార్చి నెలాఖరు, విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి పంపిణీ చేస్తామని మంత్రి గొట్టిపాటి ప్రకటించారు.
నాణ్యమైన విద్యతోనే అభివృద్ధి.…
నాణ్యమైన పాఠశాల విద్యతోనే భావి తరాలు అభివృద్ధి చెందుతాయన్న సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. ప్రైవేటు స్కూల్స్, కార్పొరేట్ విద్యకు ధీటుగా మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. అదే విధంగా చదువుల్లో రాజకీయాలు ఉండకూడదనే పార్టీ గుర్తులు లేకుండా విద్యార్థులకు బ్యాగ్ లు, పుస్తకాలు, యూనిఫాంలు నాణ్యమైనవి అందించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మెగా డిఎస్సీ ద్వారా ఒకేసారి 16,300 టీచర్ పోస్టులను భర్తీ చేశామని ఆయన స్పష్టం చేశారు.
పోటీ ప్రపంచంలో విద్యార్థులు కూడా మంచిగా చదివి తల్లిదండ్రులతో పాటు పాఠశాలలకు గొప్ప పేరు తీసుకు రావాలని ఆయన సూచించారు. ఒక్కొక్క సైకిల్ రూ.6 వేల వ్యయంతో విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. ఏల్చూరు పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను అందించడంలో తోడ్పాటు అందించిన సీల్ వెల్ కంపెనీ అధినేత సుబ్బారావును మంత్రి గొట్టిపాటి అభినందించారు. ముందుగా ఏల్చూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి, లబ్ధిదారులకు పింఛను అందించారు. అనంతరం ఏల్చూరులో మంత్రి గొట్టిపాటి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వాటిని అధికారులకు అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రసన్నాంజనేయునికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గొట్టిపాటి.…
అద్దంకి మండలం శింగరకొండలో కొలువుదీరిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం 71వ వార్షికోత్సవ తిరునాళ్లు ప్రారంభం సందర్భంగా ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం నాడు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రి గొట్టిపాటికి వేద పండితులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి గొట్టిపాటికి అర్చకులు వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. తాగునీరు, క్యూ లైన్లు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ సరఫరాతో పాటు అన్నీ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. తిరునాళ్లు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా సాగాలని మంత్రి గొట్టిపాటి ఆకాంక్షించారు. అదే విధంగా శింగర కొండపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి కూడా పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గొట్టిపాటి, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి గొట్టిపాటి కొందరు భక్తులకు స్వయంగా తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడం విశేషం.