గ్లోబల్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దే చంద్రబాబు విజన్..
పర్యాటకం నుంచి ఆర్థిక శక్తివంతమైన నగరంగా అమరావతి..
అమరావతి రాజధాని నిర్మాణానికి కొత్త దిశను చూపించేలా సీఆర్డీఏ అథారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 61వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే పలు వ్యూహాలకు ఆమోదం లభించింది. మొత్తం 18 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోగా, వాటిలో కొన్ని అమరావతి రూపురేఖలను పూర్తిగా మార్చే స్థాయిలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
భవిష్యత్ నగర నిర్మాణంలో “అర్బన్ మొబిలిటీ ప్లానింగ్”కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. రవాణా, మౌలిక వసతులు, పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక అభివృద్ధి అన్నీ సమన్వయంతో ఉండేలా రాజధానిని అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.
అమరావతిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా నిలబెట్టేందుకు “జెయింట్ అబ్జర్వేషన్ వీల్” నిర్మాణానికి అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీపీపీ విధానంలో నిర్మించబోయే ఈ భారీ ప్రాజెక్టు, లండన్ ఐ తరహాలో ఉండనుంది. ఇది పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా, అమరావతి బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే గుర్తుగా నిలుస్తుందని భావిస్తున్నారు.
పర్యావరణ హిత నగర నిర్మాణంలో భాగంగా “డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్” అమలుపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఉన్న టాబ్రీడ్ ఒప్పందాన్ని రద్దు చేసి, కొత్త టెండర్లకు ఆమోదం తెలిపారు. ప్రత్యేక డక్ట్‌ల ద్వారా భవనాలకు సెంట్రల్ కూలింగ్ అందించే ఈ విధానం వల్ల విద్యుత్ వినియోగం తగ్గడమే కాకుండా, నగరం మరింత గ్రీన్ సిటీగా మారనుంది. ఏపీలో ఉన్న బల్క్ చిల్లింగ్ యంత్రాల తయారీ సంస్థలను వినియోగించుకోవాలని సీఎం సూచించడం స్థానిక పరిశ్రమలకు కూడా ప్రోత్సాహంగా మారింది.
అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా, భారీ ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా “అమరావతి ఎకనామిక్ రీజియన్” అభివృద్ధికి కూడా అడుగులు పడ్డాయి. ఏలూరు నుంచి ప్రకాశం వరకు తొమ్మిది జిల్లాలను కలుపుతూ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించేందుకు ఆర్ఎఫ్‌పీకి అథారిటీ ఆమోదం తెలిపింది. హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, వ్యాపార కార్యకలాపాలకు అవసరమైన మౌలిక వసతులను వేగంగా అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు.
మానవీయ విలువలకు ప్రాధాన్యం ఇస్తూ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు కూడా వసతి కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. అలాగే భూసమీకరణలో అనువుగా లేని ప్లాట్లు పొందిన రైతులకు గ్రామకంఠంలో 5 సెంట్ల వరకు భూమి కేటాయించే నిర్ణయం రైతులకు ఊరటనిచ్చింది.
మారుతున్న జీవనశైలికి అనుగుణంగా “వర్క్ ఫ్రమ్ హోమ్” టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. నివాస ప్రాంతాల్లోనే కమర్షియల్ కార్యకలాపాలు, ఆధునిక కమ్యూనికేషన్ సదుపాయాలు ఉండేలా రూపకల్పన చేయనున్నారు. దీని వల్ల ట్రాఫిక్ తగ్గడమే కాకుండా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అధికారులు చెబుతున్నారు.
హైకోర్టు భవనాల వద్ద రూ.547 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అథారిటీ ఆమోదం తెలిపింది. అక్రమ నిర్మాణాలు, భవన వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక బిల్డింగ్ ట్రైబ్యునల్, మీడియేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే అమరావతికి సొంత ఫైర్ వింగ్ ఏర్పాటు చేసి, స్వయంగా ఎన్ఓసీలు జారీ చేసే వ్యవస్థకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఎల్పీఎస్ లేఅవుట్లలో వినియోగానికి అనువుగా లేని ప్రాంతాల్లో ఏటీఎంలు, కియోస్క్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దిగువ, మధ్యతరగతి ప్రజలకు సరసమైన గృహ సముదాయాల నిర్మాణంపై కూడా సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. కొత్త అలాట్మెంట్ కోడ్‌ల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 495 మంది రైతులకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇవ్వాలని అథారిటీ అంగీకరించింది.
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చూస్తే, అమరావతి కేవలం భవనాల సముదాయం కాకుండా, ఆధునిక సాంకేతికత, ఆర్థిక శక్తి, పర్యావరణ పరిరక్షణ, మానవీయ విలువల సమ్మేళనంగా రూపుదిద్దుకుంటోందని స్పష్టమవుతోంది.